Komera Ankarao Story: నల్లమల అడవి.. రెండు తెలుగు రాష్ట్రాలకు లంగ్ ఏరియా లాంటిది. ఈ హరిత సౌరభంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఈ వ్యర్థాలను తిని జంతువులు అనారోగ్యంతో చనిపోతున్నాయి. ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన ఈ సమస్యను ఒంటిచేత్తో ఎదుర్కొన్నాడు కొమెర అంకారావు. ఈ హరిత యోధుడిని అంతా జాజిగా పిలుస్తారు. నల్లమల సమీపంలోని ఓ గ్రామంలో జన్మించిన అంకారావు, దూర విద్యలో రెండు పీజీలు పూర్తిచేసిన విద్యావంతుడు కూడా. అయినా, తన జీవితాన్ని ప్రకృతి పరిరక్షణకు అంకితం చేశాడు. వారంలో ఐదు రోజులు తన ద్విచక్ర వాహనంపై నల్లమల అడవిలోకి ప్రయాణిస్తాడు. అక్కడి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, సంచిలో నింపి, చెత్త ఏరుకునే వారికి అప్పగిస్తాడు. గత కొన్నేళ్లుగా ఈ పనిని నిరంతరం కొనసాగిస్తున్నాడు. వర్షాకాలంలో విత్తనాలు తీసుకెళ్లి, రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో చల్లుతాడు. అవి అంకురించాయో లేదో చూసి, అవసరమైతే తానే సంరక్షణ బాధ్యత తీసుకుంటాడు. ఈ కృషితో రహదారల వెంబడి మినీ అడవులనే సృష్టించాడు అంకారావు. ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సాధించలేని ఫలితాలను అంకారావు ఒంటరిగా సాధించాడు.
అంతేకాదు, ‘ప్రకృతి పాఠశాల’ పేరుతో పుస్తకం రాసి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాడు. ఐదు వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ గురించి బోధించాడు. అతని సేవను గుర్తించిన ‘ది వీక్’ మ్యాగజైన్ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతని కృషిని గుర్తించింది. అటవీ పరిరక్షణ సలహాదారుడిగా నియమించింది. అయితే ఈ పదవి ద్వారా అతనేమీ లగ్జరీలు ఆశించట్లేదు. ఇప్పటికీ సంచి భుజాన వేసుకుని, వ్యర్థాలు సేకరిస్తూ, విత్తనాలు చల్లుతూ, నల్లమలను పచ్చగా మార్చేపనిలో నిమగ్నమయ్యాడు.
Also Read: Ambati Rambabu: కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై అంబటి రాంబాబు ట్వీట్..
Komera Ankarao Story: మరోవైపు, వైసీపీ హయాంలో సలహాదారుల పేరుతో జరిగిన దోపిడీ అందరికీ తెలిసిందే. రాజకీయ నిర్వాసితులను, సొంత వారిని, అనర్హులను సలహాదారులుగా నియమించి, వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారిక వర్గాల ప్రకారం, వైసీపీ పాలనలో 300 మందికి పైగా సలహాదారులను నియమించి, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ సలహాదారులంతా ఏం సలహాలిచ్చారో తెలీదు. రాష్ట్రాన్ని మాత్రం భ్రష్టు పట్టించిన మాట వాస్తవం. లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడుగా చెబుతున్న రాజ్ కెసిరెడ్డి.. జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారు. ఇక్కడే అర్థమౌతోంది.. వైసీపీ ప్రభుత్వం సలహాదారుల పేరుతో స్కామ్‌స్టర్లను కీలక హోదాల్లో నియమించుకుని, వారితోనే స్కాములు చేయించినట్లు స్పష్టమౌతోంది. తన సొంత పత్రికలో పనిచేసే వక్తుల్ని కూడా సలహాదారులుగా తెచ్చిపెట్టుకుని లక్షల్లో జీతాలు చెల్లించాడు జగన్‌మోహన్ రెడ్డి. కార్లు, బంగళాలు, ఒక్కొక్కడికి పదుల సంఖ్యలో పనోళ్లు అదనం. ఇంత లగ్జరీలు ప్రజల సొమ్ముతో అనుభవించిన వైసీపీ సలహాదారుల్లో… కొమెర అంకారావు లాంటోళ్లు బూతద్దం పెట్టి వెతికినా కనబడరు అన్నది అక్షర సత్యం. వైసీపీ హయాంలోని సలహాదారులతో పోలిస్తే… కొమెర అంకారావు లాంటి నిస్వార్థ సేవకుడు… గంజాయి వనంలో తులసి మొక్క లాంటోడని చెప్పొచ్చు. ఇక్కడే చంద్రబాబు-జగన్‌మోహన్ రెడ్డి పాలనకు తేడా కూడా అర్థమౌతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు, మేధావులు.