Prakash Raj

Prakash Raj: నటుడు ప్రకాష్‌ రాజ్‌కు షాక్.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!

Prakash Raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులపై ఆయన చేసినట్లుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బీజేపీ నేత మరియు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆయనపై ఏకంగా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు.

మనొభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం:
కోట్లాది మంది భక్తులు ఆరాధించే దేవతలను విమర్శించడం సరికాదని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. కేవలం హిందూ మతంపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇతర మతాల విషయంలో ఇలాగే మాట్లాడే ధైర్యం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ కేవలం విమర్శలు చేస్తూ భక్తుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని, ఇది ఏమాత్రం సహించరాని విషయమని హెచ్చరించారు.

పోలీస్ కేసులకు సిద్ధం:
పరువు నష్టం దావాతో పాటు, ప్రకాష్ రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా భానుప్రకాష్ రెడ్డి నిర్ణయించారు. సినిమాల్లో డైలాగులు చెప్పినట్లు సమాజంలో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఊరుకోరని ఆయన స్పష్టం చేశారు. హిందువులందరికీ ప్రకాష్ రాజ్ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలు:
ఈ వ్యవహారం ఇప్పుడు అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వీహెచ్‌పీ (VHP) వంటి సంఘాలు కూడా ప్రకాష్ రాజ్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. అయితే ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ ఇంకా స్పందించలేదు. ఆయన ఇచ్చే వివరణను బట్టి ఈ గొడవ మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *