KNL Adoni Dist Ashalu: ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కీలక దశ ప్రారంభమైంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, పేర్ల మార్పు వంటి అంశాల పై కూటమి ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఉపసంఘ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా అందిన వందలాది అర్జీలు, వినతులను సీఎం ముందుంచి, జిల్లాల సరిహద్దులు, డివిజన్ పునర్విభజన, కొత్త మండలాల ఏర్పాటు, పేర్ల మార్పుల పై సవివరంగా చర్చించారు. సీఎం సూచనలతో తుది నివేదికను సిద్ధం చేసి, నవంబర్ 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదానికి తీసుకువెళ్లే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. జనగణన ప్రక్రియ మొదలయ్యేలోపే జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. నవంబర్లో కేబినెట్ ఆమోదం, డిసెంబర్ మధ్యన ప్రజల అభ్యంతరాల స్వీకరణ, చివరగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నది కూటమి ప్రభుత్వ ప్రణాళిక.
కొత్త జిల్లాల రూపకల్పనకు ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో కమిటీని ఏర్పరచింది. ఆగస్టు 13న సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించిన కమిటీ, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల అభిప్రాయాలను సేకరించింది. ఇప్పటి వరకు 200కు పైగా వినతులు అందగా వాటిని మూడు రోజుల క్రితం సమీక్షించింది. జిల్లా వారీగా ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక పరిస్థితులు, అభివృద్ధి వెనుకబాటుతనం వంటి అంశాలను దృష్టిలో ఉంచి సిఫార్సులు సిద్ధం చేసింది.
Also Read: TDP New Leadership Drive: నాయకుల కార్ఖానా.. అవకాశాల గని.. టీడీపీ కోసం బాబు బిగ్ ప్లాన్
కర్నూలు జిల్లాలోని ఆదోని జిల్లా ఏర్పాటుపై ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల డిమాండ్ ఉన్నా, తాజా మంత్రివర్గ కమిటీ నివేదికలో ఆ అంశం ప్రస్తావన లేకపోవడంతో ఆ ప్రాంత ప్రజల ఆశలు సన్నగిల్లాయి. ఆదోని మండలంలో దాదాపు 1.50 లక్షల పైగా జనాభా, పరిపాలనా యంత్రాంగం కొరత, అభివృద్ధి మందగమనం వంటి కారణాలతో కొత్త జిల్లా అవసరమని స్థానిక ప్రజలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆదోని, హోళగుంద, ఆలూరు, పత్తికొండ వంటి మండలాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని పలుమార్లు డిమాండ్ చేశారు. అయితే.. తాజాగా తయారైన నివేదికలో ఈ ప్రతిపాదన లేకపోవడంతో “ఆదోనికి మొండి చేయా?” అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పరిపాలనా విభజనలో సమతౌల్యం కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
గత వైసీపీ హయాంలో జిల్లాల విభజనలో ఏర్పడిన లోపాలను సరిదిద్దడమే ఈ కసరత్తు ఉద్దేశమని కూటమి ప్రభుత్వం భావిస్తున్నా… ప్రజలు మాత్రం అభివృద్ధి వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ వినిపిస్తోంది. ఆదోని లాంటి ప్రాంతాలు మరోసారి విస్మరించబడకూడదు అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మార్కాపురం, అమరావతి, ఏజెన్సీ ప్రాంతం వంటి చోట్ల కొత్త జిల్లాల ప్రతిపాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి నవంబర్‌లో జరిగే కేబినెట్ భేటీలో ఆదోని ప్రాంత వాసుల కోరిక నెరవేరుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

