Kalyanadurg scam

Kalyanadurg scam: ఈ-స్టాంప్‌ గోల్‌మాల్‌ సూత్రధారి ఎవరు?

Kalyanadurg scam:  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ-స్టాంప్‌ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఒక మీసేవ నడుపుకునే వ్యక్తి ఈ కుంభకోణానికి తెర లేపాడు. అతని పేరు ఎర్రప్ప. అందరూ అతన్నిమీసేవ బాబు అని పిలుస్తుంటారు. అదనపు ఆదాయం కోసం అతని భార్య పేరిట స్టాంపు వెండర్ లైసెన్స్ తీసుకున్నాడు ఎర్రప్ప. దాదాపు 15 వేల ఈ-స్టాంపులు గోల్మాల్ చేసి, రెండు కోట్ల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, తన ఖజానా నింపుకున్నాడు. ఈ విషయం నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాదాపు నాలుగేళ్లు అతను ఆడింది ఆట, పాడింది పాటగా జరిగిపోయింది. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నా ఎవరూ గుర్తించలేదంటే హాస్యాస్పదంగా కూడా ఉంది. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టుగా ఉంది ఈ స్టాంపు వ్యవహారం. దీని వెనకాల ఉన్న బిగ్ బాస్ ఎవరో పోలీసులు దర్యాప్తులో తేలాలి.

ఈ కుంభకోణం వెనకాల పెద్ద నేత హస్తం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. నకిలీ స్టాంపుల నియంత్రణ కోసం 2018లో ఈ-స్టాంపుకు టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ-స్టాంపు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్టీ అధికారంలోకి రావడంతో, సీఎం జగన్మోహన్ రెడ్డి 2021లో ఈ-స్టాంపును ఆమోదించారు. అప్పటినుంచి ఈ-స్టాంపుకు రెక్కలు వచ్చాయి. మంచి డిమాండ్ పెరగడంతో మీసేవ నిర్వాహకుడు ఎర్రప్ప నకిలీ స్టాంపులకు తెరలేపి, ఫోటోషాప్ ద్వారా నకిలీ స్టాంపులు సృష్టించి కోట్ల రూపాయలు దోచుకున్నాడు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌తో ఎర్రప్పకు మంచి పరిచయాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఉషశ్రీ అండదండలతో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎర్రప్ప వ్యాపారం సాగించాడని, అతనికి నాయకుల సహకారం ఉందని అంటున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎర్రప్ప… ఎమ్మెల్యే సురేంద్రబాబు పంచన చేరి, పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ ఎమ్మెల్యేకు నమ్మిన బంటుగా మారాడని, ఎర్రప్పను ముందు పెట్టి వెనక నుంచి ఎమ్మెల్యేనే ఈ వ్యవహారం అంతా నడిపించారని వైఎస్సార్‌సీపీ ప్రచారం చేస్తోంది. ఈ స్టాంపు కుంభకోణంతో తనకు, తన ఎస్ఆర్ఎస్ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎమ్మెల్యే సురేంద్రబాబుకు సంబంధించిన ఎస్ఆర్ఎస్ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి… బ్యాంకు సెక్యూరిటీ కొలాటరల్ కోసం తీసే బాండ్ పేపర్లలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. బ్యాంకు అధికారులు ఆడిటింగ్ చేస్తుండగా నకిలీ ఈ-స్టాంపులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్ ఇన్‌ఫ్రా సంస్థ అనంతపురం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎర్రప్పను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తుండగా ఈ స్టాంపు కుంభకోణంలో మరో ట్విస్ట్ బయటపడింది.

ALSO READ  Hyderabad: దారుణం.. న్యాయం కోసం వెళ్తే మహిళపై లైంగిక వేధింపులు..

Also Read: Tadipatri High Voltage: మీ పాసుగాల.. ఏందీ రచ్చ?

Kalyanadurg scam: అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్.. ప్రెస్ మీట్ పెట్టి, ఈ స్టాంపు వ్యవహారంలో మీసేవ బాబు రెండు కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ఈ స్టాంపు కేసును అనంతపురం పట్టణం నుంచి కళ్యాణదుర్గానికి బదిలీ చేశారు. అయితే కళ్యాణదుర్గం డీఎస్పీ రవికుమార్ ప్రెస్ మీట్ పెట్టి, ఈ-స్టాంపు కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు ఉన్నం మారుతి చౌదరి ప్రస్తావన తెచ్చారు. మారుతి చౌదరి ఒత్తిడి వల్లే… ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు, మోహన్ బాబులు ఈ స్కామ్‌కు పాల్పడ్డారని తెలిసిందని డీఎస్పీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఉన్నం మారుతి చౌదరి పాత్ర ఏంటి, అసలు రాజకీయ నాయకుల ప్రమేయం ఏ మేరకు ఉందనేది ప్రజలకు తెలియాల్సి ఉంది.

కళ్యాణదుర్గం ఈ-స్టాంప్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ట్విస్ట్ మీద ట్విస్ట్. మొన్నటివరకు ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు, సూత్రధారి, పాత్రధారి అనుకున్నారు. అయితే ఇప్పుడు రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నం మారుతి చౌదరి, స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు… వీరందరిపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ స్టాంపు కుంభకోణం వెనక అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది ప్రభుత్వం, అదే విధంగా పోలీసు యంత్రాంగం నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది. జిల్లా ఎస్పీ ఒక మాట, డీఎస్పీ మరో మాట, రాజకీయ నాయకుల వింత విమర్శలు.. ఎవరికి వారు తప్పు వారే చేశారంటూ మీడియా ముందు చెప్పుకుంటున్నారు. అసలు దోషులు ఎవరనేది దర్యాప్తు సంస్థ తేల్చాలి. మరి కళ్యాణదుర్గం నకిలీ ఈ-స్టాంపు కుంభకోణం వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలుస్తారా? లేక కేసును నీరుగారుస్తారా? అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *