Kallola Karanyam

Kallola Karanyam: ఆపరేషన్‌ కగార్‌: యూఏవీ డ్రోన్‌ల మారణ హోమం

Kallola Karanyam: మావోయిస్టు పార్టీకి పెట్టని కోటగా ఉన్న అడవుల్లో బలగాలు పైచేయి సాధిస్తున్నాయి. కీకారణ్యాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు కేంద్ర కమిటీ ముఖ్య నేతలే లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ముఖ్య నాయకత్వాన్ని ఏరివేసినట్టయితే క్యాడర్ అంతా బలహీనపడుతుందన్న యోచనతో పోలీసు అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర కమిటీ నాయకులతో పాటు అనుబంధ విభాగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుని బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. గత నెల 21న జరిగిన ఎదురు కాల్పుల్లో పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మరణించగా, నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ గౌతం అలియాస్ సుధాకర్ అలియాస్ చంటి, బాలకృష్ణ అలియాస్ రామరాజు అలియాస్ అరవింద్ అలియాస్ సోమన్న మృతి చెందినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాకు చెందిన లక్ష్మీ నరసింహాచలం అలియాస్‌ గౌతం అలియాస్‌ సుధాకర్‌.. 40 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ.. పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీలో ముఖ్య నాయకుల్లో ఒకరుగా ఎదిగి.. దండకారణ్యంలో జనతన్ సర్కార్‌లో విద్యా వ్యవస్థ బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం.

ఒకప్పుడు దండకారణ్యం అంటే భద్రతా బలగాలకు వొణుకు. ఇప్పుడు టెక్నాలజీ వాడకంతో సీన్ రివర్స్ అయింది. గత ఆరేడు నెలల కాలంలో భద్రతా బలగాలు డ్రోన్‌ సేవలపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆరు ప్రధాన ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరగడంలో అత్యంత కీలకపాత్ర మానవ రహిత యూఏవీ డ్రోన్‌లదే. దీంతో మావోయిస్టు కదలికలను కనిపెట్టి, తక్కువ సమయంలోనే వారున్న ప్రాంతాలకు చేరుకోవడం భద్రతా బలగాలకు సులువుగా మారింది. ఫలితంగా మావోయిస్టులు కోలుకోలేని దెబ్బలు తింటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 403 మంది మావోయిస్టులు మృతి చెందారని గణాంకాలు చెపుతున్నాయి.

2004లో నాటి పీపుల్స్ వార్, మావోయిస్టు, కమ్యూనిస్టు సెంటర్ కలిసి మావోయిస్టు పార్టీగా ఏర్పడినప్పుడు 42 మందితో కేంద్ర కమిటీ ఏర్పాటైంది. ఈ 21 ఏళ్లలో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, సహజ మరణాలతో కేంద్ర కమిటీలోని సభ్యుల సంఖ్య నేడు 16కి తగ్గిపోయిందని సమాచారం. రెండు దశాబ్దాల ప్రస్థానంలో మావోయిస్టు పార్టీ మధ్యభారతంలోని కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలో జనతన్ సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. అబూజ్‌మడ్ వంటి కంచుకోటలను ఏర్పాటు చేసుకుని నాయకులను, క్యాడర్‌ను కాపాడుకుంది. కానీ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ కగార్‌తో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదరయ్యాయి. వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో కీలక నాయకులు కూడా ఉన్నారు. కేంద్ర కమిటీలో ప్రస్తుతం 16 మంది ఉన్నట్లు సమాచారం.

Also Read: Chenab Railway Bridge: ప్ర‌ధాని ప్రారంభించిన చీనాబ్ వంతెన విశేషాలు మీకు తెలుసా?

Kallola Karanyam: వీరిలో ఏపీ, తెలంగాణకు చెందినవారు 11 మంది కాగా, జార్ఖండ్‌కు చెందినవారు ముగ్గురు, ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు ఇద్దరు ఉన్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన వారిలో మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోనూ, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మోడెం బాలకృష్ణ, పాక హన్మంతు అలియాస్ ఊకే గణేష్, కట్టా రామచంద్రరెడ్డి అలియాస్ రాజుదాదా, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, పోతుల కల్పన ఉన్నారు. జార్ఖండ్‌కు చెందినవారు మిసిర్ బెస్రా అలియాస్ సునీల్, అనల్‌డా అలియాస్ పాతిరాం మాంజీ, సహదేవ్ అలియాస్ అనూజ్ కాగా… ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు మాజీదేవ్ అలియాస్ రాంధీర్, మాడ్వి హిడ్మా. వీరిలో చాలామంది 60 ఏళ్లకు పైబడినవారే. కాగా, కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎవరిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తారంటూ పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నాయి.

హింసకు హింస సమాధానం కాదని, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులతో పాటు అమాయక గిరిజనులను కూడా కాల్చి చంపుతున్నారని, ఆపరేషన్ కగార్‌ను ఆపాలని, మావోయిస్టులతో వెంటనే చర్చలు జరపాలని ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి’ అనే అంశంపై దేశవ్యాప్త చర్చ జరగాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. మన దేశ పౌరులే సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారని, వాటిని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి వారిపై దాడులకు దిగడం సరికాదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. చట్ట ప్రకారం ఎవరైనా చర్చలకు సిద్ధపడ్డప్పుడు చర్చలు జరపాలే కానీ యుద్ధం సాగించడం సరికాదంటున్నారు. చూడాలి మరి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *