Janam Loki Pawan: రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించారు. ఇక నుంచి వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, అదే సమయంలో పార్టీ నేతలకు కూడా సమయం ఇచ్చి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ, క్యాడర్ను పట్టించుకోవడం లేదని, పార్టీ కోసం పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి రిపోర్టులు తెప్పించుకున్న తర్వాతే తాను మాట్లాడుతున్నానని, పార్టీ బలోపేతం కోసం ఎవరూ అవసరమైన కార్యక్రమాలు చేపట్టడం లేదని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఇక నుంచి జనసేన పార్టీని జనంలోకి మరింత చేరువ చేయాలని, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేసి, పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను అందులో తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటనకు తాను కూడా బయలుదేరాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. డిప్యూటీ సీఎం హోదాలో అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూనే, మరోవైపు జనసేనాధిపతిగా వీర మహిళలు, జన సైనికులతో కూడా సమావేశాలు నిర్వహించి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేసేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం ఈ అక్టోబర్ నెలలోనే కొన్ని జిల్లాల్లో పర్యటించేలా కార్యాచరణ రూపొందించాలని తన టీంకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఆయా జిల్లాల నేతలతో మాట్లాడి తేదీలను ఖరారు చేయడంతో పాటు, అక్కడి సమావేశాలు ఎలా ఉండాలనే అంశాలపై పలు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేయాలని, ఆ విధివిధానాలు త్వరలోనే చెబుతామని ప్రకటించిన పవన్, తానే స్వయంగా రంగంలోకి దిగడంతో, జనసేన నేతలు, కార్యకర్తల్లో మరింత జోష్ ఉంటుందని జనసేన నేతలు భావిస్తున్నారు.
Also Read: Andhra Pradesh: ఏపీలో కొత్తగా 17 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు..
ఈ నెలలోనే తొలుత మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాల సందర్శన ద్వారా తన పర్యటనకు శ్రీకారం చుట్టాలని పవన్ నిర్ణయించారు. కురుపాం వెళ్లి ఆ పాఠశాలను పరిశీలించడంతో పాటు, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంతో పాటు ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కూడా పవన్ పర్యటించనున్నారు. అలాగే, తన శాఖకు సంబంధించిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజోలు నియోజకవర్గానికి వెళ్లనున్నారు. పర్యటనల సమయంలో మొదట అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, ఆ తర్వాత స్థానిక జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇటు అధికారిక కార్యక్రమాలు, అటు పార్టీ కార్యక్రమాలతో పవన్ బిజీ కానున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నేతలను, కార్యోన్ముఖులను చేసే దిశగా పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పవన్ జిల్లాల పర్యటన తేదీలను అధికారులు త్వరలో ఖరారు చేయనున్నారు.