Jalsa Jagan Jsp Counter: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ల వీకెండ్ పర్యటనలపై వైసీపీ చేస్తోన్న ప్రచారంలో వాస్తవముందా? కూటమి నేతలు ప్రభుత్వ ఖర్చుతో హైదరాబాద్‌లో జల్సా చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, పవన్ అయితే ఏకంగా 122 సార్లు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేశారని వైసీపీ సోషల్ మీడియాలో ఆరోపిస్తోంది. అయితే వైసీపీ ప్రచారానికి కూటమి నేతలు గట్టి కౌంటరే ఇచ్చారు.
వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు మంత్రి లోకేశ్. ముఖ్యమంత్రిగా జగన్ తన ఐదేళ్ల హయాంలో రూ.220 కోట్ల ప్రజాధనం తన పర్యటనలకు వెచ్చించారని, సగటున ఒక్కో ప్రయాణానికి రూ.7 కోట్లు ఖర్చు చేశారని లోకేశ్ ఎత్తిచూపారు. తాడేపల్లి నుంచి ఆ పక్కనే ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయానికి వెళ్లేందుకు కూడా జగన్ హెలికాప్టర్ వాడేవారని విమర్శించారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో చంద్రబాబు ఒక్కో పర్యటనకు గరిష్ఠంగా రూ.25 లక్షలు మాత్రమే ఖర్చవుతోందని, ఐదేళ్లలో గరిష్ఠంగా రూ.100 కోట్లు మాత్రమే ఖర్చయ్యే అవకాశం ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. లీజుకు తెచ్చిన చాపర్‌తో చంద్రబాబు సమయం, డబ్బు ఆదా చేస్తున్నారని వివరించారు నారా లోకేశ్. చంద్రబాబు గత 15 నెలల్లో చేసినన్ని పర్యటనలు, జగన్ ఐదేళ్లలో కూడా చేసి ఉండరని, అయినప్పటికీ రూ.220 కోట్లు ఆయన పర్యటనలకు ఖర్చు అయ్యింది, ఈ దుబారా బ్యాచ్‌కు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని లోకేష్ ధ్వజమెత్తారు.
Also Read: jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుందా?
ఇక జనసేన కూడా వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండించింది. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ప్రయాణాలకు ప్రభుత్వ నిధులను ఎప్పుడూ ఉపయోగించలేదని, సొంత ఖర్చుతోనే ప్రయాణాలు చేస్తున్నారని స్పష్టం చేసింది. ఆయన తనకు వచ్చే జీతాన్ని పిఠాపురంలో 42 మంది పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తున్నారని, మైసూరావారిపల్లి విద్యార్థులకు ఆటస్థలం కొనుగోలు చేసి ఇచ్చారనీ, గిరిజన గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తున్నారని జనసేన తెలిపింది. కానీ, జగన్ 5 కి.మీ. ప్రయాణానికి కూడా హెలికాప్టర్ వాడి, రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడని విమర్శించింది జనసేన పార్టీ. అదే సమయంలో తాడేపల్లి ప్యాలెస్ మరమ్మతులకు రూ.40 కోట్ల ప్రజా ధనాన్ని జగన్ వృథా చేసిన సంగతి మర్చిపోకూడదని జనసేన ఎద్దేవా చేసింది. జగన్ పర్యటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ట్రాఫిక్ ఆపించి, చెట్లు నరికించి, పరదాలు కట్టుకుని, ప్రజలను ఇబ్బంది పెట్టారని జనసేన ఘాటుగా విమర్శించింది. ఇక వైసీపీ అవాస్తవ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఆ పార్టీ అనుకూల మీడియాకు కూడా ఈ హెచ్చరిక వర్తిస్తుందని జనసేన స్పష్టం చేసింది.