Jagan Totapuri Plans: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ టీడీపీ ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తమకు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే నేతల దృష్టికి తెస్తున్నారు. అలాగే ప్రభుత్వ పనితీరు బాగుందని కితాబు ఇస్తున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి బొమ్మ కన్పించింది. ఈ వ్యవహరం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. సైకోలను, బ్లేడ్ బ్యాచులను వెంటేసుకుని తిరిగితే.. ప్రజల దృష్టి మళ్లుతుందని వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చాలా బలంగా నమ్ముతున్నట్లున్నారు. ఇటీవల సత్తెనపల్లి ఘటనలో జగన్ బలప్రదర్శన పిచ్చికి మూడు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. స్వయంగా జగన్ మోహన్ రెడ్డి కారు కింద పడి ఆ పార్టీకి చెందిన కార్యకర్తే చనిపోయారు. పైగా తనపై ఫిర్యాదు చేసిన సింగయ్య భార్యను తన ఇంటికి పిలిపించుకుని ఓదార్పు డ్రామాతో.. ఆమెను బెదిరింపులకు గురి చేశారనే ప్రచారమూ జరుగుతోంది. ఇదో పక్కన జరుగుతూనే ఉంది.. ఇంకోవైపు మరో హైడ్రామాకు తెర తీశారు జగన్ మోహన్ రెడ్డి.
మామిడి రైతులను పరామర్శిస్తానంటూ జగన్ చిత్తూరు జిల్లా పర్యటన పెట్టుకున్నారు. పరామర్శకు అని పర్మిషన్ అడిగిన జగన్.. తన వెంట ఏకంగా 10 వేల మందికిపైగా కార్యకర్తలు వస్తారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరామర్శకు పది వేల మందా అని అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి. చిత్తూరు జిల్లాలో రైతులను పరామర్శించడానికే జగన్ వెళ్లేట్టు అయితే బలప్రదర్శన తరహాలో వెళ్లడం దేనికి? జన సమీకరణ టార్గెట్లు, వాహనాల మొహరింపు, బలప్రదర్శన ఎందుకు? తోతాపురి మామిడితో సంబంధం లేని కడప జిల్లా నుంచి కార్యకర్తల్ని ఎందుకు తరలిస్తున్నారు? రైతుల పరామర్శకే అయితే మండలాల వారీగా కార్యకర్తల సమీకరణ ఎందుకు? బంగారుపాళ్యానికి కార్యకర్తల్ని భారీగా తరలించడం వెనుకున్న ఉద్దేశ్యం ఏమిటీ..? చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల నుంచి 25 వేల మంది కార్యకర్తల్ని తరలించాల్సిన అవసరం ఉందా?
దీని కోసం 90 బస్సులు, 1810 కార్లు, వ్యాన్లు, 2230 బైకులతో దండయాత్ర చేస్తారా? రైతుల కోసం అని వెళ్తున్న జగన్ వెనుక గట్టిగా 100 మంది రైతులు వచ్చే పరిస్థితి ఉందా? మండల స్థాయి లీడర్లకు టార్గెట్లు అందుకేనా? ప్రతీ మండలం నుంచి వందల కార్లతో రావాలని కార్యకర్తలకు ఎందుకు చెబుతున్నారు? ఈసారి ఎవరిని కారు కింద తొక్కించేస్తారు? మీ రాజకీయ కార్యక్రమాలకు పరామర్శలను వేదికగా చేసుకుంటారా? సత్తెనపల్లి పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించి తాను చేసిన పర్యటన వల్ల ముగ్గురు చనిపోయిన ఘటనను జగన్ మరిచిపోయారా..? లేక అదే తరహా ఘటనలు మళ్లీ మళ్లీ జరగాలని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారా..? చిత్తూరు తోతాపురి మామిడికి ఏ మాత్రం సంబంధం లేని కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తల సమీకరణ ఎందుకు చేస్తున్నారు..? అని ప్రశ్నిస్తున్నారు కూటమి పార్టీల నేతలు.
Also Read: CM Chandrababu: శ్రీశైలం జలకళ: సీఎం చంద్రబాబు హర్షం, రాయలసీమకు జలసంకల్పం!
Jagan Totapuri Plans: ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు ఇస్తోన్న టార్గెట్లు, జరుపుతోన్న మండలాల వారీ సమీకరణ చూస్తుంటే.. ఇది పరామర్శ కాదు.. కచ్చితంగా బల ప్రదర్శనేననేది క్లియర్ కట్‌గా అర్థమవుతోంది అంటున్నారు టీడీపీ నేతలు. పుంగనూరు మండలం నుంచి వంద చొప్పున కార్లు, టూ వీలర్లును మొహరిస్తున్నారు. రొంపిచర్ల మండలం నుంచి 25 కార్లు, పులిచెర్ల మండలం నుంచి 25 కార్లు, సొదెం మండలం నుంచి 30 కార్లు, సోమల మండలం నుంచి 25 కార్లు, 20 టూ వీలర్లు, చౌడేపల్లె మండలం నుంచి 33 కార్లు, 50 టూ వీలర్లు, నగరి మండలం నుంచి 20 కార్లు, 15 టూ వీలర్లు, పుత్తూరు మండలం నుంచి 20 కార్లు, 15 టూ వీలర్లు, నిండ్ర మండలం నుంచి 15 కార్లు, వడమాల పేట మండలం నుంచి 15 కార్లు, 10 టూ వీలర్లు, విజయపురం మండలం నుంచి 20 కార్లు, 10 టూ వీలర్లు, కె.నగరం మండలం నుంచి 20 చొప్పున కార్లు, టూ వీలర్లు, వెదురుకుప్పం మండలం నుంచి 20 కార్లు, జీడీ నెల్లూరు మండలం నుంచి 20 కార్లు, బంగారుపాళెం మండలం నుంచి 100 కార్లు, 500 టూ వీలర్లు, తవణంపల్లె మండలం నుంచి 40 కార్లు, 100 టూ వీలర్లు, ఇవి కాకుండా.. దూర ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలను తెచ్చేందుకు బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందంటున్నారు తెలుగుదేశం నేతలు. ఇదేమి రాజకీయం జగన్ రెడ్డీ? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ స్థాయిలో పరామర్శ పేరిట చేస్తున్న దండయాత్రకు పోలీసులు అనుమతులిస్తారా? లేదా? ఎలా కట్టడి చేస్తారు? జరగబోయే ఉపద్రవాన్ని ఎలా నిలువరిస్తారు? అనేది వేచి చూడాల్సిందే.

