Jagan – Jogi Liquer Scam: చెడపకురా చెడేవు అంటారు. వైసీపీకి అతికినట్టు సరిపోతున్నది ఈ సామెత! ఆఫ్రికాలో అమాయకుల రక్తం పీల్చేసిన కాలకేయుల ముఠానే ఆరున్నరేళ్లుగా ఏపీని పట్టి పీడిస్తున్న నకిలీ మద్యాన్ని తయారు చేస్తోందన్న ఆరోపణలున్నాయి. బాబాయిని చంపుకుని ‘నారాసుర రక్త చరిత్ర’గా కట్టు కథ అల్లిన వారే… నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుండటం విస్తుగొలుపుతోంది. వివేకా రక్తం చంద్రబాబు చొక్కాకు అంటించాలని చూసినట్లు.. నేడు నకిలీ మద్యం మరకలు అంటించేందుకు విఫలయత్నం చేశారా? వివేకా కేసును ఆరేళ్లుగా అడ్డుకుంటున్న దుష్ట గ్రహాలు.. నకిలీ మద్యం గుట్టు రట్టు అవ్వగానే.. కేసు సీబీఐకి ఇవ్వాలంటూ ఘోషిస్తోంది అందుకేనా? ఏది ఏమైనా సిట్ వేసి కల్తీగాళ్ల తాట తీసేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు.
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు నకిలీ మద్యంలో దొరికిపోయింది వైసీపీ. ఇది పక్కా ప్లాన్డ్గా తాడేపల్లి స్థాయిలో జరిగిన కుట్రే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్రికాలో నకిలీ మద్యం వ్యాపారంలో టైకూన్లుగా ఎదిగారు వైఎస్ బ్రదర్స్. అలా ఆఫ్రికాలో నేర్చుకున్న సారా నైపుణ్యాన్ని ఏపీలో ప్రయోగించేందుకే నకిలీ మద్యం కుటీర పరిశ్రమలు తెరిచారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అసలు అసెంబ్లీ సాక్షిగా జగన్ తాను కట్టబోయే రాజధాని ‘సౌతాఫ్రికా మోడల్’ అన్నప్పుడే అనుమానించాల్సిందేమో… వీరికి, ఆఫ్రికాకు ఉన్న సంబంధమేంటో అంటున్నారు అనలిస్టులు. ఇక నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్థన్ రావుకు, తనకు ఉన్న సంబంధాల గురించి వాట్సాప్ చాటింగులతో సహా అడ్డంగా దొరికేశారు మాజీ మంత్రి జోగి. తాతల కాలం నుండి ఒకే బజార్లో పుట్టి పెరగడమే కాదు.. జనార్థన్ రావు, జోగి రమేష్‌లు జిగిరీ దోస్తులు అని కూడా వెలుగు చూసింది. ప్రభుత్వంపై నకిలీ మద్యం కుట్రని ప్రయోగించడానికి ముందే.. జనార్థన్ రావును తప్పించేందుకు ఆఫ్రికాకు పంపించింది కూడా జోగి రమేషే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇంతకీ నకిలీ మద్యంతో ప్రభుత్వంపై కుట్ర చేయాలన్న ఆలోచన ఎవరిది? జోగి సొంతంగా చేసిన ఆలోచనా? లేక పైస్థాయిలో బిగ్‌బాస్ నడిపించిన కుట్రనా? అన్నది తేలాల్సి ఉంది. విచిత్రంగా జగన్ మోహన్‌రెడ్డి లండన్‌కి వెళ్లినప్పుడే రాష్ట్రంలో ఇలాంటి కుట్రలు జరుగుతుండటం ఏపీ ప్రజలకు కూడా అనుభవమే.
Also Read: Bihar Polls: 57 మంది అభ్యర్థులతో జేడీయూ తొలి జాబితా
ములకలచెరువులో కల్లీ మద్యం డంప్‌లు వెలుగు చూడటం, సురేంద్రనాయుడు, పీఏ రాజేష్‌ల పేరుతో షాపులు ఉండటం, వాటినే జనార్ధన్‌రావు తాత్కాలికంగా అద్దెకు తీసుకోవడం, చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం తయారు చేయడం ద్వారా సీఎం చంద్రబాబును అప్రతిష్ట పాల్జెయ్యాలని చూడటం, ఆ ఎపిసోడ్ బెడిసికొట్టడంతో ఇబ్రహీంపట్నం కేంద్రంగా మరోపథకం, అధికారులకు సమాచారం, వైసీపీ అఫిషియల్ మీడియా సారథ్యం వహించడం, అంతా పక్కా ప్లాన్ ప్రకారమే నడిచినట్లుగా తెలుస్తోంది. వివేకా హత్య కేసులోనూ ఇదే తరహా ప్లాన్ నడిచింది. శవానికి కుట్లేసి గుండెపోటుగా చిత్రీకరణ చేశారు. బయటపడడంతో సిఎం చంద్రబాబుపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు. కోడికత్తి డ్రామాని జగన్‌పై హత్యాప్రయత్నంగా చిత్రీకరించారు. గత ఎన్నికల్లో రాళ్లదాడిలోనూ ఇదే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూస్తుంటే గత కుట్రలకు సీక్వెన్స్గానే ఈ నకిలీ మద్యం కుట్ర తెరపైకి వచ్చిందని భావించాల్సి వస్తోంది అంటున్నారు పలువురు పొలిటికల్ అనలిస్టులు. ప్రస్తుతం సిట్ విచారణ చేస్తోంది. ఈ కేసులో అయినా బిగ్ బాస్ వరకూ వెళ్తేనే.. భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు మళ్లీ జరగకుండా అడ్డుకునే వీలుంటుంది. అలా కాకుండా.. ఇప్పటికే నడుస్తున్న సిట్ కేసుల్లానే.. ఇది కూడా మారిందంటే.. ఇక ఏపీని ఆ దేవుడే రక్షించాలి.