Harsha Investigation Fail: పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి ఐజీ అశోక్ కుమార్ శనివారం ఓ విస్పష్ట ప్రకటన చేశారు. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయారని ఐడీ స్పష్టం చేశారు. అతిగా మద్యం సేవించి… ఆ మత్తులోనే వాహనాన్ని నడుపుతున్న క్రమంలో ప్రవీణ్ మూడు సార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ఈ క్రమంలోనే ఆయన చనిపోయారని ప్రకటించారు. ఈ విషయంలో ఇప్పటిదాకా పలు రకాలుగా ప్రవీణ్ మరణాన్ని వివాదాస్పదం చేసేలా ప్రకటనలు చేసిన వారితో పాటుగా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి నోటీసులు జారీ చేసినట్లు కూడా ఐజీ ప్రకటించారు. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదం కారణంగా జరిగిన మరణమేనని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని కూడా ఆయన తేల్చి చెప్పారు. ప్రవీణ్ ను హత్య చేశారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ప్రవీణ్ పగడాల మృతికి దారి తీసిన అన్ని పరిస్థితులను ఐజీ సవివరంగా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి బైక్ పై బయలుదేరిన ప్రవీణ్ పగడాల ఈ విషయాన్ని తన కుటుంబానికి తప్పించి మరో వ్యక్తికి తెలపలేదని చెప్పారు. మార్గమధ్యంలో రెండు చోట్ల ఆగిన ప్రవీణ్… ఆ రెండు ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో డిజిటల్ పేమెంట్లు చేశారని తెలిపారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో పలు మార్లు ఆగిన ప్రవీణ్… ఆరుగురు వ్యక్తులతో సంభాషించారని తెలిపారు. ఈ విషయాలను తాము ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ధృవీకరించుకున్నామని తెలిపారు. ఇక ప్రవీణ్ తన ప్రయాణంలో మద్యం సేవించారని, అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఐజీ తెలిపారు.
Harsha Investigation Fail: ఇక ప్రవీణ్ పగడాల మృతదేహానికి చేసిన పోస్టుమార్టం నివేదిక కూడా వచ్చిందని… అందులోనూ రోడ్డు ప్రమాదం కారణంగానే ప్రవీణ్ చనిపోయినట్లు తేలిందని ఐజీ తెలిపారు. విచారణలో భాగంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులతో పాటుగా ఆయా ప్రాంతాలకు చెందిన దాదాపుగా 113 మందిని విచారించామని తెలిపారు. విచారణలో ఏ ఒక్కరు కూడా ప్రవీణ్ మృతిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. చివరకు ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదన్నారు. ఈ మొత్తం విచారణలో ప్రవీణ్ హత్యకు గురయ్యారన్న చిన్న క్లూ కూడా లభించలేదని, రోడ్డు ప్రమాదం కారణంగానే ఆయన చనిపోయారని తేలిందని ఐజీ చెప్పారు.
Also Read: Ponnavolu Vs Ambati: వైసీపీ లీగల్ సెల్ చీఫ్‌గా అంబటి?
అయితే.. ఈ పాస్టర్ ప్రవీణ్ ఎపిసోడ్‌లో ఓవరాక్షన్ చేసిన వాళ్ల సంగతేంటని ఇప్పుడు జనం ప్రశ్నిస్తున్నారు. మతి స్థిమితంగా ఉందో లేదో తెలీని కేఏ పాల్, ఏపీ పాలిటిక్స్‌లో ఎప్పుడో జోకర్ల జాబితాలో చేరిపోయిన మాజీ ఎంపీ హర్షకుమార్, వైసీపీకి ఊడిగం చేసుకునే జాన్ బెన్నీ లింగం వంటి ఫేక్ పాస్టర్లు, ఒళ్లు తెలీకుండా రెచ్చిపోయిన మరికొందరు కుర్ర పాస్టర్లను పట్టుకొచ్చి తిక్క కుదిరేలా ట్రీట్మెంట్ ఇవ్వకుండానే.. అలా సభ్య సమాజంలోకి వదిలేస్తే ఎలా అన్న అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ బుర్ర తక్కువ ఉన్మాద బ్యాచ్ ఎంత రెచ్చగొట్టాలని చూసినా, శాంత స్వభావులైన దైవజనులు అపారమైన నిగ్రహం పాటించారు కాబట్టే ఏపీ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది కానీ… లేకుంటే చరిత్ర చూడని రక్తపాతానికి దారి తీసుండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు అభద్రతాభావం, మరోవైపు విపరీతమైన అమాయకత్వంలో ఉన్నారు క్రిస్టియన్ మైనార్టీలు.
Harsha Investigation Fail: వీళ్ల పరిస్థితి క్యాష్ చేసుకునేందుకు సందుకో పాస్టర్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. వీళ్లంతా కలిసి, ఎవడికి వాడే జనాలను పోగు చేసుకుని, విచ్చలవిడిగా సంఘాలు ఏర్పాటు చేసుకుని… దైవసందేశాన్ని ఉపదేశించాల్సిన చోట.. పరమత ద్వేషాన్ని నింపుతున్నారు. టచ్‌తో ట్రీట్మెంట్లు, తైలాలు, దశమభాగాలతో దేవుడిని, దైవజనుల్ని దోపిడీ చేస్తున్నారు. దైవజనులు అమాయక చక్రవర్తులు అవ్వటం వల్లే వీరి ఆటలు ఇలా సాగుతున్నాయి. బాధ్యత కలిగిన మత పెద్దలు మంచిని బోధిస్తున్నా వారికి ఆదరణ లేకుండా పోయింది. దీనికి కారణం స్వలాభం కోసం దైవజనుల్ని వివిధ ఆకర్షణలకు గురిచేసి, పక్కదారులు పట్టిస్తున్న ఈ ఫేకుగాళ్లే అన్న వాదన క్రైస్తవ సమాజం నుండే వినిపిస్తోంది. దీనిని నియంత్రించే వ్యవస్థ స్వయంగా ఆ కమ్యూనిటీలో ఉందో లేదో తెలీదు. ఇలాంటి సున్నితమైన అంశాలు మనకెందుకులే అని ప్రభుత్వాలు కూడా పట్టించుకోవు. పరిస్థితిని ఇలాగే వదిలేస్తే.. మత వైషమ్యాలకు దూరంగా ఉండే ఏపీ ప్రజానీకంలో అశాంతిని పెంచి పోషించినట్లే అవుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.