Government Should React

Government Should React: ప్రజా పాలనలో వింతలు.. బీఆర్‌ఎస్‌ ‘నిరసనలు’

Government Should React: కూరగాయల గంపలో కొడుకు తోటకూర కట్ట దొంగిలించినప్పుడే తల్లి గట్టిగా మందలించి ఉంటే… వాడు మరిన్ని దొంగతనాలు చేసి జైలు జీవితం గడిపేవాడు కాదు కదా. మహా న్యూస్ కార్యాలయం మీద బీఆర్ఎస్ గుండాలు రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడి చేసి దౌర్జన్యం సృష్టించినప్పుడు.. ఆనాడే సర్కారు కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఈ రోజు సొంత పార్టీ నుండి ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న కార్యాలయం మీద దాడికి తెగబడేవారు కాదు కదా. మహాన్యూస్‌ కార్యాలయంపై జరిగిన భయానక దాడి తెలంగాణ ముందెప్పుడూ చూడలేదు. మీడియా వర్గాలను, ప్రజలను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది ఈ దాడి ఘటన. కానీ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తామరాకుపై నీటి బొట్టల్లే ప్రవర్తించింది. మహాన్యూస్‌పై దాడికి ముందు, తర్వాత కూడా ప్రభుత్వం కొంత నాన్‌ సీరియస్‌గా వ్యవహరించిందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. దాడి చేసిన తర్వాత దర్జాగా మహాన్యూస్‌ కార్యాలయం నుండి జై కేటీఆర్‌ నినాదాలు చేసుకుంటూ కార్లలో వెళ్లిపోయిన బీఆర్‌ఎస్‌ గూండాలకు తెలంగాణ భవన్‌ ఆశ్రయం కల్పించింది. గూండాలను అరెస్ట్‌ చేయడానికి పోలీసులు బీఆర్‌ఎస్‌ నేతల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏదో అరెస్ట్‌ చేశాం, రిమాండుకు తరలించాం అని పోలీసులు చేతులు దులిపేసుకున్నారు కానీ.. వెంటనే ఆ గూండాలకు బెయిల్‌ కూడా మంజూరైంది.

Also Read: Jubilee Hills By-Elections: పొన్నం, పీసీసీ చీఫ్ అండ అతనికే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో అర్జున్ గౌడ్?

ఇక మహాన్యూస్‌పై దాడికి సంబంధించి కానీ, తీన్మార్‌ మల్లన్నపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి కానీ… ప్రభుత్వ నిఘా యంత్రాంగం వైఫల్యం కనిపిస్తోంది. మహాన్యూస్‌పై దాడి జరగడం, దానిని బీఆర్‌ఎస్‌ నేతలు సమర్థించుకోవడం, “జగదీష్‌ రెడ్డి లాంటోళ్లు అది దాడి కాదు.. నిరసన మాత్రమే.. దాడి జరిగితే కథ వేరేలా ఉంటుంది.. ఇంకో మూడు నాలుగు చానళ్లున్నాయ్‌.. వాటికీ అదే గతి పడుతుంది” అంటూ హెచ్చరించడం, మీడియాకు ఆంధ్రా మీడియా, కమ్మ మీడియా అంటూ కులాన్ని, ప్రాంతాన్ని ఆపాదించి.. మేధావుల ముసుగులో ఉండే కొందరు బీఆర్‌ఎస్‌ తొత్తులు బీఆర్‌ఎస్‌ దాడులకు… అడుగులకు మడుగులొత్తినట్లుగా వ్యవహరించడం, ‘తెలంగాణలో ఆంధ్రా మీడియా’ తరహా శీర్షికలతో ఏకంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు పెట్టడం, దాడుల్లో భాగంగా ఆంధ్రజ్యోతి కార్యాలయానికి హెచ్చరికలు చేయడం, ఇవన్నీ గమనిస్తూ కూడా రేవంత్‌ సర్కార్‌.. తీన్మార్‌ మల్లన్నపై దాడిని ఆపలేక పోయింది అంటే… నిఘా వ్యవస్థల వైఫల్యమా? లేక కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థతా? అన్న చర్చకు తావిస్తోంది. ఆంధ్రా ముద్ర వేసి మీడియా సంస్థలపై దాడులు చేయడం స్పష్టంగా బీఆర్‌ఎస్‌ తీసుకున్న రాజకీయ విధానంలో భాగమని అర్థమౌతోంది. దాడులు వారే చేస్తారు.. దానికి నిరసన అంటూ వారే పేరు పెడతారు.. తిరిగి వారే కంప్లయింట్‌ చేస్తారు. ఇది బీఆర్‌ఎస్‌ గూండాలు, వారిని నడిపించే నాయకుడి ఆదేశానుసారం అనుసరిస్తున్న దాడుల యొక్క మోడస్‌ ఆపరెండి. రేవంత్‌ సర్కార్‌ ఇప్పటికైనా సీరియస్‌గా చర్యలు తీసుకోకపోతే… ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ఈ దాడులను ఎదుర్కొనాల్సి వస్తుంది. అది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నష్టం చేస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఈ దాడుల సంస్కృతి చూస్తుంటే… అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఆటవిక రాజ్యంలో బతుకుతున్నామా! అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌కు మీడియా తరఫున చెప్పాలనుకుంటోంది ఒక్కటే. మాట తూలినంతనే దాడులు చేస్తారా? దాడులే బీఆర్‌ఎస్‌ సంస్కృతా? మాటలు జారితే దాడులు చేయాలంటే… ఉద్యమ కాలం నుండి మొన్నటికి మొన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేలిన అవాకులు, చెవాకుల దాకా… మీ మీద ఎన్ని సార్లు, ఎంత మంది దాడులు చేయాలో బీఆర్‌ఎస్‌ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *