Disputes in Aluru TDP: కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాల్లో ఆలూరు ఒకటి. ఇటీవలే ఈ నియోజకవర్గంలో ఇన్చార్జిగా వీరభద్రగౌడ్ ను తప్పించి, వైకుంఠం జ్యోతికి పార్టీ పగ్గాలు అప్పగించారు. పార్టీ బలోపేతంతో పాటు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ లో టిడిపి జెండాను రెపరెపలాడించాలని ఉద్దేశంతో ఇన్చార్జి మార్పు జరిగింది. అయితే ఇటీవల గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరులు నారాయణ పార్టీ వీడెందుకు సిద్ధం కావడంతో సైకిల్ పార్టీలో కలవరం మొదలైంది. ఆలూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా గతంలో పనిచేసిన గుమ్మనూరు నారాయణ గుంతకల్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు వరసకు సోదరుడవుతారు.
వైసీపీ హయాంలో ఇద్దరూ సొంత అన్నాదమ్ముల్లాగానే ఆలూరు నియోజకవర్గంలో రాజకీయాలపై పట్టు సాధించారు. నాటి మంత్రి గుమ్మనూరు జయరాంకు నారాయణ అన్నీ తానై నడిపించేవారు. దీంతో పాటు వాల్మీకి సామాజికవర్గంలో గట్టిపట్టున్న నేతగా గుర్తింపు పొందారు. అనంతరం ఎన్నికల్లో ముందు జరిగిన పరిణామాలతో గుమ్మనూరు జయరాం టిడిపి చేరారు. ఆ సమయంలోనే నారాయణ కూడా అన్న బాటలో నడిచారు. గుమ్మనూరు గుంతకల్లు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆలూరు నియోజకవర్గంలో నారాయణ, ఆయన అనుచరులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు నియోజకవర్గంలో అన్నీ తామై వ్యవహరించి, చక్రం తిప్పిన వారు ప్రస్తుతం ఆలూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. కొంతకాలం కిందట వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రగౌడ్‌తో నారాయణ ఒకింత స్నేహంగా మెలిగినా.. ఆయన మాట పెద్దగా చెల్లుబాటయ్యేది కాదు. అయితే ఇటీవల వీరభద్ర గౌడ్‌ను తప్పించి వైకుంఠం జ్యోతికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో వైకుంఠం జ్యోతి వర్గీయులకు గుమ్మనూరు నారాయణ వర్గీయుల మధ్య పొంతన లేకపోలేదు.
Also Read: Lokesh: నమో’ అంటే నాయుడు-మోదీ: డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్‌గా ఏపీ అభివృద్ధి: మంత్రి లోకేశ్
లోలోపల అసంతృప్తి ఉన్నా బయటపడకుండా నారాయణ వర్గీయులు సరిపెట్టుకున్నారు. ఇటీవలే వైకుంఠం జ్యోతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె భర్త వైకుంఠం శివప్రసాద్ గుమ్మనూరు నారాయణకు పొసగడం లేదు. ఫలితంగా నియోజకవర్గంలో గుమ్మనూరు నారాయణ రాజకీయంగా ఎలాంటి పనులు చేసుకోలేని పరిస్థితి తలెత్తింది. దీంతో నారాయణ బిజెపిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో భాగంగా తొలుత ఆయన భార్యను బిజెపిలోకి పంపారు. త్వరలో ఆయన కూడా పార్టీని అధికారికంగా వీడనున్నట్లు సెగ్మెంట్ లో టాక్ నడుస్తోంది. మరోవైపు ఇంచార్జిగా ఉన్న వైకుంఠం జ్యోతి పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. అయితే అందర్నీ కలుపుకొని పోవాలని హైకమాండ్ సూచిస్తుంది. కార్యకర్తలు పార్టీ విడకుండా చూసుకోవాలని ఆదేశించింది. మరి ఇంచార్జి ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి.

