CI Shankaraiah Notice: 2019 మార్చి 15న ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అసలు నేరస్థులు ఎవరో ప్రపంచమంతా తెలుసు. కానీ సీబీఐ వారిని అరెస్టు చేయదు. అటు సీబీఐకి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తోక జాడిస్తూ వెక్కిరిస్తున్నట్లుంది నిందితుల వ్యవహారం. ప్రభుత్వం ఏదున్నా వారి హవా అలా సాగుతోంది. ఈ కేసులో పులివెందుల సీఐగా వ్యవహరించిన జె.శంకరయ్య… వివేకా హత్య జరిగిన తర్వాత నిందితులకు సహకరించారనే ఆరోపణలున్నాయి. తాజాగా, శంకరయ్య… సీఎం చంద్రబాబు నాయుడుకు రూ.1.45 కోట్ల పరువు నష్టం నోటీసు పంపి సంచలనం రేపారు. అసెంబ్లీలో చంద్రబాబు తనపై అసత్య ఆరోపణలు చేశారని, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు శంకరయ్య.
2019లో వివేకా హత్య సమయంలో శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు. రక్తపు మరకలు తుడిపించడం, ఆధారాలు ధ్వంసం చేయడంలో నిందితులు సీఐ శంకరయ్యని భయపెట్టో, ఆశ పెట్టో వాడుకున్నారంటూ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. అయితే సీఎం చంద్రబాబు ఏమీ ఆశామాషీగా చేసిన వ్యాఖ్యలు కావు అవి. సీబీఐ చార్జిషీట్లోనూ ఈ విషయం ఉంది. శంకరయ్య తొలుత ఆధారాల ధ్వంసం జరిగిందంటూ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఒత్తిడితో మాట మార్చారని ఆరోపణలు ఉన్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనను బెదిరించారని, కేసు నమోదు చేయొద్దని, శవంపై గాయాల గురించి చెప్పొద్దని ఒత్తిడి చేశారని తొలుత వాంగ్మూలం ఇచ్చారు సీఐ శంకరయ్య. అయితే, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు మాత్రం హాజరు కాకుండా దాటవేశారు.
Also Read: Karnataka High Court: ఇది అమెరికా కాదు మస్క్.. ఇది భారత్.. రూల్స్ పాటించాల్సిందే
వివేకా హత్య కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో 2019లోనే సీఐ శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేశారు. అయితే 2021లో జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసి, శంకరయ్యకు పోస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన కర్నూలు రేంజ్లో వీఆర్‌లో ఉన్నారు. నిందితులు ప్రభావితం చేయడం వల్లే సీఐ శంకరయ్య మాట మార్చారన్నది ఇక్కడ స్పష్టం. అయినా చంద్రబాబు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సీబీఐ రిపోర్ట్ ఆధారంగానే ఉన్నాయి. అయినా కూడా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసు ఇచ్చే స్థాయికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక సీఐ వచ్చాడంటే… వివేకా హత్య కేసు నిందితుల హవా ఏ రేంజ్లో నడుస్తోందో అర్థమౌతోంది. వివేకా హత్యకేసు 2019 ఎన్నికల్లో వైసీపీకి సానుభూతి తెచ్చిపెట్టగా, 2024 ఎన్నికల్లో ఇదే కేసు వైసీపీ ఓటమికి కారణమైంది. ఓడినా వారి ఆటలు సాగుతూనే ఉన్నాయన్నది తాజా ఘటనతో స్పష్టమౌతోంది.
ఏది ఏమైనప్పటికీ ఒక సీఐ.. ముఖ్యమంత్రికి నోటీసు పంపడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు ఈ నోటీసుపై ఎలా స్పందిస్తారో, శంకరయ్య సర్వీస్‌పై దీని ప్రభావం ఏమిటో చూడాలి.