Big Shock to Adoni YCP: కర్నూలు జిల్లాలో సెకండ్ బాంబేగా పిలవబడే ఆదోని నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.. అధికారంలో లేకున్నా నియోజకవర్గంలో తన మార్క్ రాజకీయం చేయాలని చూస్తున్నారు. తన నుంచి దూరమైన వాళ్లను పదవి నుంచి దింపేయడంలో పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ బడాయి దానమ్మపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆమెను తొలగించి వేరే వారిని ఎంపీపీ చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్ళారు. అయితే ఆమెపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేయడంలో కూటమి నాయకులు సక్సెస్ అయ్యారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి గట్టి షాక్ ఇచ్చారు. టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తన మార్క్ రాజకీయంతో ఈ సారి పట్టు నిలుపుకున్నారు.
Also Read: New Rules: నవంబర్ 1 నుంచి: గ్యాస్ ధరల నుంచి బ్యాంక్ అకౌంట్ వరకు… కొత్త రూల్స్!
ఎంపీపీగా కొనసాగుతున్న బడాయి దానమ్మపై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారణం ఆమె భర్త బడాయి పంపాపతి కూటమి నాయకులతో సన్నిహితంగా ఉండడం. దీన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టి పక్కకు తప్పించాలని భావించారు. కానీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, కూటమి నాయకులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్ళారు. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారము 29 ఎంపీటీసీలకు గాను 2/3 వంతు… అంటే 19 మంది అవిశ్వాస తీర్మానంకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు ముందే సూచించారు. అయితే వైసీపీకి 20 మంది సభ్యులు ఉండగా… వారిలో 16 మంది మాత్రమే సమావేశ మందిరానికి వచ్చారు. మిగిలిన నలుగురు వైసీపీ ఎంపీటీసీలు హాజరు కాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం విరిగిపోయిందని అధికారులు సభ్యులకు చెప్పడంతో కూటమి నాయకుల సంబరాలు జరుపుకున్నారు.
అవిశ్వాస తీర్మానంలో తాము ఎలాగైనా నెగ్గుతామని వైసిపి ఎంపీటీసీలు భావించారు. ఈ నేపథ్యంలో టిడిపి చెందిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పక్కా వ్యూహంతో.. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం వెనుక ప్రధాన పాత్ర పోషించారని సెగ్మెంట్లో టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకున్నారని కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపులో ప్రస్తుత ఎంపీపీగా ఉన్న బడాయి దానమ్మ తన అనుచరులతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తానికి ఆదోని సెగ్మెంట్లో నువ్వా నేనా అన్నట్లు వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల రాజకీయాలు నడుస్తున్నాయి.

