Bhashyam Success Story

Bhashyam Success Story: యువ నాయకత్వంలో సరికొత్త ‘భాష్యం’

Bhashyam Success Story: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో 100కి పైగా శాఖలతో విస్తరించింది భాష్యం విద్యా సంస్థ. ప్రీ-ప్రైమరీ నుండి హైస్కూల్ వరకు అధునాతన సౌకర్యాలతో కూడిన పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, కాలేజీలకు భాష్యం ప్రసిద్ధి చెందింది. సీబీఎస్‌ఈ సిలబస్‌, ఇంటర్మీడియట్ కోర్సులతో పాటూ జేఈఈ పరీక్షలకు శిక్షణనివ్వడంలో ఆరితేరింది భాష్యం. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో ఈ సంస్థ తన పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసి, అందరికీ అందుబాటులో అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందజేస్తోంది. భాష్యం విద్యా సంస్థలు 1993లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోనే స్థాపించబడ్డాయి. భాష్యం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు భాష్యం రామకృష్ణ. విద్య, నైపుణ్యాలకు పెట్టింది పేరైన తెలుగు గడ్డపై నాణ్యమైన చదువులను అందించడం, విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న ఆయన ఆలోచనల నుండి పుట్టిందే భాష్యం. ఒక చిన్న పాఠశాలగా ప్రారంభమై, అనతికాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం వెనుక భాష్యం రామకృష్ణ ముందుచూపు, ఆలోచనలు, కృషి కీలకపాత్ర వహించాయని చెబుతారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటగా విద్యలో ఆధునిక బోధనా పద్ధతులు, భోధనలో స్టూడెంట్‌ సెంట్రిక్‌ విధానాలు ప్రవేశపెట్టింది భాష్యం విద్యాసంస్థలేనని చెప్పొచ్చు.

గత మూడు దశాబ్దాలలో.. ఏపీ, తెలంగాణలలో ప్రీ-స్కూల్ నుండి ఇంటర్మీడియట్ వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌కు ప్రముఖ బ్రాండ్‌గా మారాయి భాష్యం విద్యాసంస్థలు. ఐఐటీ-జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడంలో భాష్యం తర్వాతే ఎవరైనా అనేవిధంగా ఈ విద్యా సంస్థలు ప్రసిద్ధికెక్కాయి. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, ల్యాబ్‌లు, క్రీడా సౌకర్యాలు, స్టూడెంట్‌ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్‌లో నడిచే చక్కటి హాస్టళ్లు భాష్యం సంస్థల ప్రత్యేకతలుగా గుర్తించబడ్డాయి. ఇక ర్యాంకుల సంగతి సరేసరి. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలలో టాప్-10ర్యాంకుల్లో భాష్యం విద్యార్థులు చాలా సార్లు నిలిచారు. ఐఐటీ-జేఈఈ, నీట్, ఒలింపియాడ్‌లు, ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో భాష్యం విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడం పరిపాటిగా మారింది. ఇక విద్యా రంగంలో భాష్యం విద్యాసంస్థలకు పోటీ లేదనే విధంగా అనేక అవార్డులను కూడా గెలుచుకున్నాయి.

Also Read: Army Air Defence Officer: పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని.. ఎప్పుడు కావాలంటే అప్పుడు పేల్చివేస్తాం.. !

Bhashyam Success Story: సాధారంగా బడా కార్పొరేట్‌ విద్యా సంస్థలు అనగానే వివాదాలు సర్వసాధారణం. అయితే ఈ విషయంలో మాత్రం భాష్యం విద్యా సంస్థలు అతి తక్కువ సార్లు వార్తలకెక్కాయి. ఇందుకు కారణం ఇక్కడ స్టూడెంట్‌కి ఏం కావాలో, వారి సమస్యలేంటో, ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నిత్యం పరిశీలించేందుకు, పర్యవేక్షించేందుకు ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ. ఆయన నిత్య విద్యార్థిలా తన క్యాంపస్‌లలో క్లాసులకు హాజరవుతుంటారట. అయితే ఆయన నేర్చుకునేది క్లాస్‌ రూంలో విద్యార్థులకు బోధించే చదువులు కాదు కానీ… విద్యార్థులకు ఇంకా అందించాల్సిన సౌకర్యాలు, వారిని మరింత మెరుగుపరిచేలా అమలు చేయాల్సిన విద్యా విధానాల గురించి నిత్య శోధనలో ఉంటారట బాష్యం రామకృష్ణ. ఇక సామాజిక బాధ్యతలో కూడా ముందు వరుసలో నిలిచాయి భాష్యం విద్యాసంస్థలు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థలు తమవంతు సహకారాన్ని అందించాయి. విద్యాసంస్థల తరపున మొత్తం రూ.4 కోట్ల చెక్కును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. అంతే కాదు… అన్న క్యాంటీన్లు, బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం అందించే అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు భాష్యం విద్యా సంస్థ కోటి రూపాయలు విరాళం అందజేసింది.

విద్యా రంగంలో అఖండ విజయాలు సాధిస్తూ… లక్షలాది మంది తెలుగు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ.. తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచిన భాష్యం విద్యాసంస్థల్లో నేడు కొత్త నీరు ప్రవహిస్తోంది. భాష్యం రామకృష్ణ లెగసీని కంటిన్యూ చేసేందుకు ఆయన వారసుడు భాష్యం సాకేత్‌ రామ్‌ సిద్ధమయ్యారు. విద్య, సామాజిక రంగాల్లో తనదైన ముద్ర వేసిన భాష్యం రామకృష్ణ.. ఇకపై ప్రజాసేవ ద్వారా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టబోతున్నారట. సామాన్యుడిలా మొదలైన తన ప్రస్థానాన్ని ఈ స్థాయికి చేర్చిన ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు రాజకీయాలను ప్లాట్‌ఫామ్‌గా ఎంచుకోబోతున్నారన్నది ఆయన సన్నిహితుల నుండి అందుతోన్న సమాచారం. అయితే మూడు దశాబ్దాల భాష్యం విద్యాసంస్థల ప్రాభవాన్ని, ప్రభంజనాన్ని అంతే స్థాయిలో ఇక ముందు కూడా కొనసాగించేందుకు ఆయన కుమారుడు భాష్యం సాకేత్‌రామ్‌ నాయకత్వం వహిస్తారని తెలుస్తోంది.

Also Read:Operation Sindoor: ఒకే దెబ్బ మూడు పిట్టలు.. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్, చైనా, టర్కీ ఓడించిన భారత్

Bhashyam Success Story: ఇప్పటికే సాకేత్‌ రామ్‌… భాష్యం విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి ఫలితాల్లో 600కు 600 మార్కులు సాధించిన సంఘటన జరిగింది. 2025 సంవత్సరంలో, కాకినాడకు చెందిన యాళ్ళ నిహాంజని అనే విద్యార్థిని ఈ అరుదైన ఘనత సాధించింది. ఇది ఆంధ్రప్రదేశ్ SSC పరీక్షల చరిత్రలో తొలిసారి అని అధికారులు ధృవీకరించారు. ఈ విజయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక్క మార్కు కూడా ఒడిసి పట్టుకునేలా సాకేత్‌ రామ్‌ మార్గదర్శకంలో రూపొందించిన కరిక్యులమే ఈ విజయానికి కారణమన్న అభిప్రాయం విద్యాసంస్థల బోధన సిబ్భంది నుండి వ్యక్తమవుతోంది. ఇక విద్యా సంస్థల ఆధునికీకరణ, డిజిటలైజింగ్‌లో కీలక పాత్ర వహిస్తున్నారు భాష్యం సాకేత్‌ రామ్‌. సాకేత్ రామ్ యువ నాయకత్వంతో సంస్థలను జాతీయ స్థాయిలో విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లను పరిచయం చేస్తూ, భాష్యం బ్రాండ్‌ను విస్తరిస్తూ ఇప్పటికే తన సమర్థతని నిరూపించుకున్నారు సాకేత్‌ రామ్‌.

భాష్యం విద్యాసంస్థలు అంటేనే వివాదాలకు దూరం, విజయాలకు దగ్గర అన్న పేరుంది. వ్యవస్థాపక చైర్మన్‌ భాష్యం రామకృష్ణ వల్లే అది సాధ్యమైంది. ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. విద్యకు సరికొత్త ‘భాష్యం’ చెప్పాల్సిన బాధ్యత ఆయన తనయుడు సాకేత్‌ రామ్‌పై ఉంది. మొత్తానికి తెలుగు రాష్టాలకు సుపరిచితమైన, టాప్‌ మోస్ట్‌ విద్యా సంస్థల్లో ఒకటైన భాష్యంను కొత్త తరం నాయకత్వం ఎలా ముందుకు నడిపించనుందో వేచిచూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *