Bandi vs Eetala War: బీకేర్ ఫుల్ బిడ్డా… నువ్వెంత? బచ్చా” అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని ఉద్దేశించి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈటల రాజేందర్ ముమ్మాటికి గొప్ప నాయకుడే. పోరాట యోధుడు కూడా. ఏ పార్టీలో ఉన్నా ఆయన రాజకీయ ప్రయాణం ఆ రకంగానే కొనసాగుతూ వచ్చింది. నేడు బీజేపీలోనూ ఆయన ఒడిదుడుకులతోనే ప్రయాణం చేస్తున్నారు. కానీ ఈటల రాజేందర్ ముందు బండి సంజయ్ బచ్చానా? అనుభవంలోనూ, చరిస్మాలోనూ, ప్రజాకర్షణలోనూ సంజయ్ కంటే ఈటల ఎందులో గొప్ప? రాజకీయాల్లో, పదవుల్లో బండి సంజయ్‌తో పోలిస్తే ఈటల రాజేందర్ సీనియర్ మోస్ట్ లీడరా? రాజకీయ వర్గాల్లో ఉన్న ఈ భావన ఎంత వరకు కరెక్ట్? బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అయినా కూడా ఆయన రూట్స్ గ్రౌండ్ లెవెలో నేటికీ పటిష్టంగా ఉన్నాయి. ఆయన ఢిల్లీ స్థాయికి వెళ్లినా కూడా… గల్లీ స్థాయిలో ప్రజలు, కార్యకర్తలతో సంబంధాలలో ఎలాంటి మార్పు ఉండదు. నేటికీ ఏ కార్యకర్త అయినా సంజయన్నా అంటూ దగ్గరికెళ్తే.. సొంత తమ్ముడిలా, అన్నలా దరికి తీసుకునే చొరవ, ప్రేమ ఆయన సొంతం. అదే ఆయన్ని మాస్ లీడర్‌గా నిలబెట్టింది. అయితే ఆ ఇమేజే ఆయన వాస్తవిక స్థాయిని కనబడనీయకుండా చేస్తోందన్న అభిప్రాయమూ ఉంది. వాస్తవానికి బండి సంజయ్ కన్నా ఈటల రాజేందర్ సీనియర్ అన్న వాదనలో ఏ మాత్రం నిజం లేదు. రికార్డ్స్, హిస్టరీ పరిశీలిస్తే వస్తున్న క్లారిటీ కూడా ఇదే.
రాజకీయానుభవంలోనూ, ప్రజా ప్రతినిధిగానూ ఈటల కంటే బండి సంజయ్ మోస్ట్ సీనియర్. ఈటల పొలిటికల్ ఎంట్రీ 2002లో జరిగితే, బండి ఎంట్రీ 1990లో జరిగింది. బీజేవైఎం ఆలిండియా సెక్రటరీగా పనిచేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయమైన ఢిల్లీలో ఏడాది పాటు పనిచేశారు. ఢిల్లీలో ఎన్నికల ఇంఛార్జీగా కూడా కొనసాగారు. భారతీయ జనతా యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, టౌన్ అధ్యక్షుడిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. 1990వ దశకంలో రాజకీయ కురువ్రుద్ధుడు, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఉప ప్రధాని ఎల్.కె అద్వానీ సురాజ్ రథ యాత్రలో బండి సంజయ్ వెహికల్ ఇంచార్జిగా, అద్వానీ రథయాత్రలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. 2020 బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టి… దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావును, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. బండి నాయకత్వంలో జీహెచ్ఎంసీలో బీజేపీ బలం 2 స్థానాల నుండి 48 స్థానాలకు దూసుకెళ్లింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో పట్టణాలకే పరిమితమైన కాషాయ జెండా పల్లెపల్లెకు చేరిపోయింది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లగలడం సంజయ్‌కి మాత్రమే సాధ్యమైంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారాయన. మోడీ, షా, నడ్డా వంటి టాప్ లీడర్లతో సన్నిహిత సంబంధాలున్న నేత. ఈ లెక్కన చూస్తే నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం సంజయుడిది. ఈటల రాజేందర్ విషయానికొస్తే… 2003లో టీఆర్ఎస్‌లో చేరి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, 2021 వరకు రాష్ట్ర నాయకుడిగా కొనసాగారు. అంటే ఈటల రాజకీయ అనుభవం 22 ఏళ్లే.
Also Read: Nara Lokesh: మా పవనన్న సినిమా వస్తుంది: నారా లోకేష్
ఇక ప్రజాప్రతినిధిగా ఎవరు సీనియర్ అనే విషయానికొస్తే… 1994లోనే బండి సంజయ్ ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్‌గా గెలుపొందారు. 1999లో రెండో సారి గెలిచి 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2004 నుండి 2019 వరకు కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్‌గా ఉన్నారు. 2023 అసంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్‌లో పడ్డ ఓట్లు 63 వేలే. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్‌కి ఒక్క హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పడ్డ ఓట్లు 73 వేలు పైచిలుకు. తనవల్లే బండి సంజయ్ రెండో సారి ఎంపీ అయ్యారన్న ఈటల వ్యాఖ్యల్లో నిజం లేదనడానికి ఈ ఫలితాలే సాక్ష్యం. ఒక్క మాటలో చెప్పాలంటే 1994 నుండి మొదలు నేటి వరకు.. ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ ప్రస్థానం 30 ఏళ్ల పైమాటే. కాకపోతే ఈటల రాజేందర్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీలో ముఖ్య నాయకుడుగా, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కానీ బండి సంజయ్ అధికారంతో పనిలేకుండానే ప్రజల్లో బాహుబలి లీడర్‌గా ఎదిగారు.
ఈటల గుండెల్లో బాధ ఉండొచ్చు కానీ, ఆయన వ్యాఖ్యలు అదే పార్టీలో ఉన్న బండి సంజయ్ అభిమానుల గుండెల్ని తీవ్రంగా గాయపరిచాయన్నది వాస్తవం. ఈటల తెలుసుకోవాల్సింది ఒక్కటే. చరిత్రలు, చెత్తబుట్టల దగ్గరే ఆగిపోతే… భవిష్యత్తులో ఎవరూ ఘన విజయాలు సాధించలేరు. ప్రజాధరణతోనే ప్రజాస్వామ్యంలో మనుగడ సాధ్యం అని ఈటల గుర్తించాలంటున్నారు పరిశీలకులు.