Bandi Sanjay Target

Bandi Sanjay Target: కరీంనగర్‌, సిరిసిల్ల జెడ్పీ స్థానాలపై సంజయ్‌ సవాల్‌!

Bandi Sanjay Target: రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల హడావుడి మొదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం న్యాయస్థానాల్లో నడుస్తోంది. ఈ అంశంపై క్లారిటీ వచ్చాకే ఎన్నికలు జరుగుతాయని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో వేచి చూసే ఇంకా ధోరణిలోనే ఉన్నాయి. అయితే, బిజెపి మాత్రం కొంత దూకుడుగా వ్యవహరిస్తోంది. అభ్యర్థుల ఎంపికతో పాటు స్థానిక సమరానికి ఎలా సమాయత్తం కావాలో ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ అంశంపై కోర్టులు ఎలా స్పందించినా, స్థానిక ఎన్నికలకు తమ అభ్యర్థులను సన్నద్ధం చేసేలా దిశా నిర్దేశం చేస్తోంది. మరీ ముఖ్యంగా, కరీంనగర్ జిల్లాకు చెందిన బిజెపి సీనియర్ నేత, ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. ఆయన కరీంనగర్‌లోనే మకాం వేసి, పార్టీ నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన అనంతరం ఆయన పార్టీ జిల్లా ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలకు తాము సిద్ధమంటూ ప్రకటించారు.

Also Read: Chandrababu Naidu: సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు కీలక భేటీ

కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో పార్టీ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలతో కూడా బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌లపై కాషాయ జెండా ఎగురుతుందని ప్రకటించారు. ఈసారి క్షేత్రస్థాయిలో బిజెపికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని బండి సంజయ్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా తమ నేతలు, కార్యకర్తలు సైనికులుగా పని చేయాలని హితబోధ చేశారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు మాత్రమే జిల్లా పరిషత్ చైర్మన్‌లుగా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు దఫాలు బిఆర్ఎస్ అభ్యర్థులే జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్నారు. అయితే, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా పరిషత్‌లను చేజిక్కించుకోవడమే కాకుండా, అన్ని సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో కూడా గెలుపే ధ్యేయంగా పని చేయాలని బండి సంజయ్ కంకణం కట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా కార్యకర్తలను, నేతలను సన్నద్ధం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి రెండు స్థానాలను గెలవడం అనుకూల అంశంగా భావిస్తున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ తమకు పోటీ కాదని బిజెపి భావిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తలస్తోంది. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని బిజెపి అభ్యర్థులు పోరాడాలని బండి సంజయ్ నిర్దేశిస్తున్నారు. ఇక అభ్యర్థుల గెలుపులో పోలింగ్ బూత్ అధ్యక్షుల బాధ్యత ఎంతో కీలకమని పార్టీ భావిస్తుంది. ఓటర్లను పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకువచ్చి, ఓటింగ్ పూర్తిస్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. మొత్తంగా, స్థానిక సమరంలో గెలుపుకు దోహదపడే అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.

ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని బండి సంజయ్ అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో టికెట్ రాకపోయినా, పార్టీ పదవులు ఇస్తామని భరోసా కల్పిస్తున్నారు. టికెట్ రానంత మాత్రాన బాధపడొద్దని, పార్టీపై నమ్మకం పెట్టుకోవాలని, ఇప్పటి నుంచే అసంతృప్తి జ్వాలలు లేకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. పార్టీకి ద్రోహం చేసే పనులు చేయకూడదని, పార్టీపై నమ్మకంతో పని చేస్తే ఎప్పటికైనా ఉన్నత పదవులు అలంకరిస్తారని బండి సంజయ్ అంటున్నారు. మొత్తంగా, ఇతర పక్షాల బలహీనతలతో పాటు సొంత పార్టీ బలాన్ని గుర్తు చేస్తూ, ఆయన స్థానిక సమరానికి పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *