Anantapur

Anantapur: 80 శాతం మంది వైసీపీ కార్పొరేటర్లు సిద్ధం?

Anantapur: అనంతపురం జిల్లాలో రాజకీయం కాక రేపుతోంది. అక్కడ వైసీపీ మేయర్‌ని దించడానికి సర్వం సిద్ధమైందట. ఉగాది పండగకు ఆటో ఇటో ముహూర్తం ఫిక్స్ చేశారని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తన చర్చించుకుంటున్నారట. 48 మంది వైసీపీ కార్పొరేటర్లు అనంతపురం మేయర్ వసీంపైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమయ్యారట. ఏకంగా 80 శాతం మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారని సమాచారం. ఇక అనంతపురం నగరంలో వైసీపీ భూస్థాపితమేనా? దీని వెనుక టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తన రాజకీయ మార్క్ చూపిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోందట.

2019 మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ కనీసం ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేక చేతులెత్తేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక లోకల్ బాడీ ఎన్నికల్లో ఫ్యాన్ హవా కొనసాగింది. మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు.. ఇలా ఏ ఎన్నికల్లోనైనా వైసీపీ గెలవాల్సిందే అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో రాజకీయం పూర్తిగా మారిపోయింది. కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, సర్పంచులు కూటమి ప్రభుత్వానికి జై కొడుతున్నారు. అనంతపురం జిల్లాలో కూడా మెజారిటీ కార్పొరేటర్లు సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారట.

Anantapur: ఇందుకు ప్రధాన కారణం మున్సిపల్ ఎన్నికలు జరగడానికి మరో ఏడాది సమయం ఉంది. కార్పొరేటర్లుగా గెలిచి నాలుగేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయామనీ, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోనైనా డివిజన్‌లలో కొంతైనా అభివృద్ధి చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకంతోనే టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనేది వినికిడి. అదేవిధంగా అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచిన 10 నెలల్లోనే నగరాన్ని అభివృద్ధి చేయడంలో తన మార్క్‌ చాటుకుంటూ ఉండటం.. వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ వైపు ఆకర్షిస్తోందని టాక్‌ వినిపిస్తోంది.

Also Read: Operation Kagar: మోస్ట్‌ డేంజరస్‌ హిడ్మాను వదలరు..!

అనంతపురం నగరంలో 50 కార్పొరేట్ డివిజన్లు ఉన్నాయి. గత పాలకులు నగరంలో కనీసం మౌలిక వసతులు కల్పించలేకపోవడంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ మూల్యమే చెల్లించుకుంది. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి 23 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే వ్యవహారశైలితో అంతర్గతంగా రాజకీయంగా నలిగిపోయిన వైసీపీ కార్పొరేటర్లు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా టీడీపీకి జై కొడుతున్నారట. ఇంత రాజకీయం జరుగుతున్నా అప్పుడు, ఇప్పుడు కూడా వైసీపీ పెద్దలు కార్పొరేటర్లకు, నాయకులకు భరోసా ఇచ్చేలా వ్యవహరించడం లేదన్న వాదనలున్నాయ్‌. ఈ నేపథ్యంలో నిజంగా ఉగాది పండుగకు వైసీపీ మేయర్ పీఠాన్ని కుల్చేస్తారా? లేక ఇవన్నీ గాలి వార్తలేనా? ఆ లోపే వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి చెక్‌ పెడతారా? ఇలా రకరకాలుగా అనంతపురం పట్టణ రాజకీయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Anantapur: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అనేక ప్రాంతాల్లో మున్సిపాలిటీ చైర్మన్లు, మేయర్ పీఠాలను కోల్పోతూ వస్తోంది. అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వైసీపీ కోల్పోయింది. ఇదే తరహాలోనే అనంతపురం మేయర్ పీఠం కూడా చేజారి పోతుందా? నిజంగా మేయర్ పీఠం చేజారితే అనంతపురం నగరంలో వైసీపీ ఉనికైనా ఉంటుందా? మాజీ ఎమ్మెల్యేతో పాటూ… వైసీపీ ఈ రాజకీయ సుడిగుండం నుంచి బయటపడగలరా? ఈ మంటలను ఆర్పడానికి వైసీపీ అధిష్టానం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది? అధికార టీడీపీ ఏం చేయబోతుంది? అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి.. రాబోయే కాలంలో అనంత నగరంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయో.!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *