Adhoni BJP vs YCP

Adhoni BJP vs YCP: ఆదోని రాజకీయాన్ని శాసిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Adhoni BJP vs YCP: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గాన్ని సెకండ్ బాంబేగా పిలుస్తారు. ఇక్కడ వ్యాపారం గానీ, రాజకీయం గానీ ఎప్పుడూ హాట్‌గానే ఉంటుంది. అలాంటి ఈ సెగ్మెంట్‌లో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మార్క్ రాజకీయం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఇక్కడ ఎమ్మెల్యేగా బీజేపీకి చెందిన పార్థసారథి గెలిచినా, మాజీ ఎమ్మెల్యే హవా కొనసాగుతోందని సెగ్మెంట్లో టాక్ నడుస్తోంది. దీంతో కూటమి నేతల్లో కలవరపాటు మొదలైంది.

ఎందుకు మాజీ ఎమ్మెల్యే హవా కొనసాగుతోందంటారా…. హ్యాట్రిక్ గెలుపుతో జోష్‌లో ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి, మొన్నటి ఎన్నికల్లో కూడా గెలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ కూటమి ప్రభంజనంలో ఆయన ఓడిపోయారు. దీంతో ఆయన హయాంలో గెలిచిన కొంతమంది ఎంపీపీలు, మున్సిపల్ ఛైర్మెన్ బంధువులు కూటమి ప్రభుత్వం గెలవడంతో పార్టీ మారారు. దీంతో మాజీ ఎమ్మెల్యేకు కోపం వచ్చింది. ఇంకేముంది… పార్టీ మారిన వారికి పదవులు లేకుండా చేసేందుకు స్కెచ్ వేశారు. అందులో భాగంగానే మొదటి అస్త్రం ప్రయోగించారు. మున్సిపల్ ఛైర్మెన్‌పై సక్సెస్ అయ్యారు.

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న నాగేంద్ర భార్య బోయ శాంతను మున్సిపల్ ఛైర్పర్సన్‌గా ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బోయ శాంత వైసీపీలోనే కొనసాగినా, ఆమె భర్త నాగేంద్ర మాత్రం బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పంచన చేరారు. దీంతో సాయి ప్రసాద్ రెడ్డి తన మార్క్ రాజకీయంతో… వైసీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్ల బలం ఉండడంతో నాలుగు నెలల క్రితం మున్సిపల్ ఛైర్మెన్ బోయ శాంతపై అవిశ్వాసం పెట్టారు. ఆమెను దించి వైసీపీ కౌన్సిలర్ లోకేశ్వరిని ఛైర్పర్సన్‌గా ఎన్నుకున్నారు. తాను వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ తనపై ఎలా అవిశ్వాసం పెడతారని బోయ శాంత మొరపెట్టుకున్నా, జగనే తనకు న్యాయం చేయాలని ఫ్లకార్డులు ప్రదర్శించినా లాభం లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే తన పంతాన్ని నెగ్గించుకున్నారు.

Also Read: Chennai: తొక్కిసలాటతో పరారీలో ముగ్గురు టీవీకే ముఖ్య నేతలు

ఇక సెకండ్‌ ఇన్సిడెంట్‌. అవినీతికి పాల్పడుతున్నారని, తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, ఎంపీపీగా ఉన్న దానమ్మను దించేందుకు పక్కా ప్రణాళికలు వేశారు వైసీపీ ఎంపీటీసీలు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ ఎంపీటీసీలు 19 మంది సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను కలిసి విన్నవించారు. ఎంపీపీ దానమ్మ 2021 సెప్టెంబరు 24న ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కచ్చితంగా నాలుగేళ్లు పూర్తి కావాలని సబ్ కలెక్టర్ సూచించారు. దీంతో నాలుగేళ్లు పూర్తవ్వగానే అవిశ్వాసానికి సిద్ధమయ్యారు వైసీపీ ఎంపీటీసీలు. ఈ పక్కా స్కెచ్ వెనుక మాజీ ఎమ్మెల్యే తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. పార్టీ ఎవరైతే మారుతారో వారిపై ఇలాంటి రాజకీయాన్ని ప్రదర్శిస్తారని సెగ్మెంట్‌లో చర్చ జరుగుతోంది.

పంచాయతీ చట్టం 1994 ప్రకారం ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టి నూతనంగా ఎంపీపీని ఎన్నుకునే క్రమంలో ఎంపీటీసీలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యే ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు గానీ, ఓటు వేసే హక్కు ఉండదు. ప్రస్తుతం ఆదోని ఎంపీటీసీల్లో మెజారిటీ శాతం వైసీపీ వారే. ఏది ఏమైనా అవిశ్వాసంలో కూడా తానే నెగ్గుతానని ఎంపీపీ దానమ్మ సవాల్ విసురుతోంది. కానీ మాజీ ఎమ్మెల్యే మాత్రం తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తారని నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇదంతా ఒక ఎత్తయితే, మాజీ ఎమ్మెల్యే మార్క్ రాజకీయాన్ని చూసి కూటమి నాయకుల్లో కలవరం మొదలైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *