Internal war in BJP: కామారెడ్డి జిల్లా బిజెపికి ఒక ప్రత్యేకత ఉంది. ఇద్దరు ఉద్దండులను ఓడించి కామారెడ్డి ఎమ్మెల్యేగా బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గెలుపొందారు. ఎన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చానంటూ… జిల్లా అభివృద్ధి చేస్తానంటూ… సొంత మానిఫెస్టోతో ప్రజలకు హామీలు ఇచ్చారు. దీంతో కామారెడ్డి జిల్లా ప్రజలు మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలను కాదని వెంకటరమణారెడ్డికి పట్టం కట్టారు. కానీ వెంకటరమణారెడ్డి ప్రస్తుతం పార్టీ వ్యవహారాల పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో గెలిచిన ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే విధంగా ఉందని బహిరంగంగానే విమర్శలు చేశారు.
క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని, ఎవరూ కూడా క్షేత్రస్థాయిలో తిరగటం లేదని అంటున్నారు ఎమ్మెల్యే కాటిపల్లి. పార్టీ కార్యక్రమాలు ప్రజల వరకూ వెళ్లడం లేదని ఆరోపించారు. నాయకులు పార్టీ ఆఫీసులకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కేవలం పార్టీ ఆఫీసుల్లో కూర్చొని కార్యక్రమాలు నిర్ణయిస్తున్నారని, గ్రౌండ్‌లోకి దిగడం లేదంటూ చెప్పుకొచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కనీసం కలిసి కూర్చోవడం లేదని, వారి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు ఎమ్మెల్యే కాటిపల్లి.
Also Read: Ponnam Prabhakar: అడ్లూరిపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం
వెంకటరమణా రెడ్డి… కేసీఆర్, రేవంత్ రెడ్డి వంటి ఉద్ధండులను ఓడించి గెలిచారు. ఆయన గెలుపులో స్థానిక సమస్యలపై పోరాటం, సామాన్య ప్రజలతో మమేకం కావడం ప్రధాన పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం కూడా కేవలం ఆఫీసుల్లో ప్రణాళికలు రూపొందించకుండా, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన కోరుకుంటున్నారు.
వెంకటరమణా రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి ఒక హెచ్చరికగా భావించాలని రాజకీయ విశ్లేఖలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నాయకత్వంపై ఆధారపడకుండా, స్థానిక నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో బలంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తేనే బీజేపీ తెలంగాణలో మరింత బలపడుతుందని కాటిపల్లి భావన కావొచ్చు. ముఖ్యంగా లోక్‌సభ, త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పరిశీలకులు.