Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు ఒక అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియన్ హైకమిషన్ తమ ప్రతిష్టాత్మకమైన ‘స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్’ (SVP)లో భాగం కావాలని కోరుతూ ఆయనకు ప్రత్యేక ఆహ్వాన లేఖను పంపింది. ఈ ఆహ్వానం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు సూచిస్తోంది.
ఆస్ట్రేలియా హైకమిషన్ తన లేఖలో ఆంధ్రప్రదేశ్‌లో మానవ వనరుల అభివృద్ధి, సాంకేతిక పురోగతి, ఆర్థిక వృద్ధిలో నారా లోకేశ్ నాయకత్వాన్ని ప్రశంసించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంస్కరణలు కొత్త విధానాలు ఆస్ట్రేలియా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాయని పేర్కొంది.
Also Read: Annamayya Chief: అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ..!!
‘స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్’ అనేది ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నాయకులను ఆహ్వానించి నిర్వహించే ఒక ముఖ్యమైన కార్యక్రమం. గత రెండు దశాబ్దాలలో భారతదేశంలోని చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.
ఈ ఆహ్వానం ద్వారా నారా లోకేశ్‌కు ఆస్ట్రేలియాలోని అగ్రశ్రేణి నాయకులు, విధాన నిర్ణేతలతో చర్చలు జరిపే అవకాశం లభిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పెట్టుబడులు సాంకేతిక సహకారాన్ని ఆకర్షించడానికి సహాయపడుతుంది. ఈ అంతర్జాతీయ గుర్తింపు నారా లోకేశ్‌కు మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక గొప్ప గౌరవం అని చెప్పవచ్చు.