Eastern Congo: తూర్పు కాంగోలో ఘోర దాడి చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ మద్దతు ఉన్న తిరుగుబాటు బృందం అలైడ్ డెమోక్రటిక్ ఫోర్స్ (ADF) కొమాండాలోని ఒక క్యాథలిక్ చర్చిపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెల్లవారుఝామున 1 గంట ప్రాంతంలో తిరుగుబాటుదారులు చర్చిలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చర్చిలోపల, బయట కలిపి 21 మంది మరణించారని కొమాండా సివిల్ సొసైటీ కోఆర్డినేటర్ డియుడోన్నే డురాంతబో తెలిపారు. మూడు కాలిపోయిన మృతదేహాలను గుర్తించామని, ఇంకా గాలింపు కొనసాగుతోందని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి: KTR: తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్‌ఎస్ ఉంటుంది
దాడి సమయంలో తిరుగుబాటుదారులు పలు ఇళ్లు, దుకాణాలకు నిప్పంటించారు. అనేక ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే కాంగో ఆర్మీ మాత్రం మృతుల సంఖ్యను తక్కువగా పేర్కొంది. “ఈ దాడిలో సుమారు 10 మంది మృతి చెందారు. కత్తులు, తుపాకులతో సాయుధులైన దుండగులు చర్చిలోకి చొరబడి ఊచకోత కోశారు” అని ఇటురి ప్రావిన్స్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జూల్స్ న్గోంగో తెలిపారు.
తూర్పు కాంగో మరియు ఉగాండా సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ADF, దశాబ్ద కాలంగా పౌరులపై ఇలాంటి దాడులు చేస్తూ వస్తోంది.