Assam: అస్సాం సివిల్ సర్వీస్ (ACS) అధికారిణి నుపుర్ బోరాను అక్రమాస్తుల కేసులో రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి విజిలెన్స్ సెల్ నిర్వహించిన దాడులలో ఆమె వద్ద భారీగా నగదు, బంగారం, ఇతర విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. తన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో నుపుర్ బోరాపై విచారణ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేరుగా ఈ కేసులో దర్యాప్తుకు ఆదేశించారు. నుపుర్ బోరాకు చెందిన పలు అపార్ట్‌మెంట్‌లపై విజిలెన్స్ సెల్ అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో దాదాపు ₹1.7 కోట్ల నగదుతో పాటు లక్షల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు లభించాయి. నగదును లెక్కించడానికి బ్యాంక్ అధికారులను, కరెన్సీ కౌంటింగ్ యంత్రాలను కూడా పిలిపించారు. నుపుర్ బోరా ఇంతకు ముందు బార్పేట జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేసినప్పుడు అక్రమ భూ బదలాయింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారికి హిందువుల భూములను అక్రమంగా బదలాయించారని ముఖ్యమంత్రి శర్మ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: BCCI: అది తప్పనిసరి కాదు.. పాక్ కు బీసీసీఐ కౌంటర్
ఈ వ్యవహారంపై గత ఆరు నెలలుగా ఆమె నిఘాలో ఉన్నారని కూడా పేర్కొన్నారు. నుపుర్ బోరా 2019 బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఆమె ప్రస్తుతం కామ్రూప్ జిల్లాలోని గొరైమారిలో సర్కిల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ అరెస్ట్‌తో అస్సాం ప్రభుత్వంలో అవినీతిపై కొనసాగుతున్న పోరాటం మరోసారి స్పష్టమైంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఆమెకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం.