Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మహాఘట్‌బంధన్‌లో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన *‘సీమాంచల్ న్యాయ యాత్ర’*ను కిషన్‌గంజ్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ దృష్టికి కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని ఇప్పటికే తెలియజేశామని, ఈ మేరకు బీహార్ రాష్ట్ర మజ్లిస్ పార్టీ నేత అఖ్తరుల్ ఇమాన్ లేఖ రాశారని వెల్లడించారు.
ఒవైసీ మాట్లాడుతూ, తమకు ఆరు సీట్లు కేటాయించాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనను మహాఘట్‌బంధన్ అంగీకరించకపోతే, అది బీజేపీకి లాభం చేకూర్చడమే అవుతుందని ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. అంతిమంగా, బీహార్ ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని, భవిష్యత్తులో ఎవరూ తమను నిందించలేరని, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష కూటమితో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒవైసీ తేల్చి చెప్పారు.