Aarogyasri: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ (జేఎచ్‌ఎస్), ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) సేవలను ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తన్హా) ప్రకటించింది.
తాజాగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వడ్డిరాజు రాకేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడం, బకాయిలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ఉదయ్‌కుమార్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు.
బకాయిల భారంతో ఇబ్బందులు
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేఎచ్‌ఎస్ పథకాల కింద ప్రస్తుతం రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ప్రభుత్వంపై పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
-
2023 డిసెంబర్ 8 వరకు రూ.723 కోట్ల మేర బకాయిలు ఉండగా,
-
కొత్త ప్రభుత్వం వచ్చాక నెలకు సగటున రూ.100 కోట్ల చొప్పున చెల్లింపులు జరిగాయని ఆరోగ్యశాఖ చెబుతోంది.
-
అయినప్పటికీ, జూన్ 9 నాటికే బకాయిలు రూ.981 కోట్లకు చేరగా, ఇప్పుడు అది మరింత పెరిగి రూ.1,000 కోట్లను దాటిందని తన్హా ఆరోపించింది.
డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరగతి ఆసుపత్రులు ఈ బకాయిల కారణంగా ఆర్థికంగా నిలబడలేక మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Narayana Swamy: వైసీపీ నేత నారాయణస్వామిని అదుపులోకి తీసుకోనున్న సిట్..?
జనవరి వాగ్దానాలు విస్మరణలోనే
గత జనవరిలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడడంతో ఆరోగ్యశ్రీ సేవలు 10 రోజుల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రభుత్వం స్పందించి రూ.117 కోట్లను విడుదల చేసింది. అదనంగా 4 నెలల్లో బకాయిలు క్లియర్ చేస్తామని, ప్యాకేజీల రేట్లను సవరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని, క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేసింది. అయితే, ఈ హామీలలో ఒక్కదానిని కూడా అమలు చేయకపోవడంతో మరోసారి సేవలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అసోసియేషన్ విమర్శించింది.
31వ తేదీ నుంచి నిరవధికంగా నిలిపివేత
ఈసారి 10 రోజులకే పరిమితం కాకుండా నిరవధికంగా సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తన్హా స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించడం, ప్యాకేజీల సవరణ వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే ప్రజలు, ముఖ్యంగా పేదవర్గాలు, తీవ్రంగా ఇబ్బందులు పడతాయని హెచ్చరించింది.