Nara lokesh: ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ ప్రయాణంలో చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం భాగస్వాములుగానే కాకుండా మార్గదర్శకులుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఐసీఏఐ నిర్వహించిన ‘అర్థసమృద్ధి–2025’ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
సీఏలు కేవలం ఆడిటర్లే కాకుండా బాధ్యత, జవాబుదారీతనానికి ప్రతిరూపాలని, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో నైతిక సలహాదారులుగా వ్యవహరించాలని కోరారు. విశాఖలో అకౌంటింగ్, ఆడిటింగ్ రంగంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ఐసీఏఐ ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిని “ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ” నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నామని, ఇందుకు అనుగుణంగా అనంతపురంలో ఆటోమోటివ్, కర్నూలులో పునరుత్పాదక ఇంధనం, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాదిలో పూర్తయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అభివృద్ధి దిశనే మార్చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
పాలనలో కృత్రిమ మేధస్సు వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకున్నామని, ఇప్పటికే ‘మనమిత్ర’ ద్వారా 700 పౌరసేవలను వాట్సాప్‌లో అందిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఇన్వెస్టర్-ఫ్రెండ్లీ విధానాల వలన గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖకు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఐసీఏఐ ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.