AP Weather Report: ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాల ముప్పు వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పంటపొలాలు నీట మునిగి రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో నిలిచిపోయిన నీటిని మోటార్ల సాయంతో తోడేందుకు ప్రయత్నిస్తున్నా, నెల రోజుల్లో చేతికొచ్చే పంట వర్షార్పణం అవుతుందని రైతులు లబోదిబోమంటున్నారు.
ఉపశమనం లేదు: మళ్లీ అల్పపీడనం
ఒకవైపు నష్టం నుంచి కోలుకోకముందే, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఏపీ ప్రజలకు పిడుగులాంటి వార్త చెప్పింది.
ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం తీరం దాటి బలహీనపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలహీనపడుతుందని అంచనా వేసినప్పటికీ, దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇంకా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇది కూడా చదవండి: Gopichand Malineni: జాట్ 2 షాకింగ్ అప్డేట్.. గోపీచంద్ ఔట్?
అయితే, ప్రజల ఆందోళనను పెంచుతూ, దక్షిణ అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాల్లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది.
- కొత్త అల్పపీడనం: దీని ప్రభావంతో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు (అంటే శుక్రవారం, అక్టోబర్ 24, 2025) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది.
- బలపడే అవకాశం: తదుపరి 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ – ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. వరుస వర్షాలు అన్నదాతను నిలువునా ముంచేస్తాయనే భయం రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.