AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాతలకు ఈ రోజు (ఆగస్టు 2) పండుగ రోజు అని చెప్పుకోవచ్చు. ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తుండగా, ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్నది. ఈ రెండు పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల ఖాతాల్లో అటు కేంద్రం నుంచి రూ.2,000, ఇటు రాష్ట్రం నుంచి రూ.5,000 చొప్పున జమకానున్నది. అందుకే ఈ రోజు రైతులకు ఒక విధంగా చెప్పాలంటే పండుగే అని చెప్పుకోవాలి.
AP News: ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు ఇవ్వనున్నది. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఆగస్టు 2న తొలి విడతగా రూ.5 వేలను రైతుల ఖాతాల్లో వేయనున్నది. మొత్తంగా ఏటా కేంద్రం ఇచ్చే రూ.6,000తో కలిపి ఒక్కో రైతు ఖాతాల్లో రూ.20,000 వరకు జమ కానున్నాయి.
AP News: ఈ మేరకు తొలి విడుతగా ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం కింద 46,85,838 మంది రైతులకు ఆంధ్రప్రదేశ్లో లబ్ధి చేకూరనున్నది. ఈ మేరకు ప్రభుత్వం రూ.2,342.92 కోట్ల నిధులను కేటాయించింది. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఒకరోజు ముందే మనమిత్ర ద్వారా లబ్ధిదారులకు ఈ పథకం విషయమై సందేశాలను పంపారు.
AP News: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికార యంత్రాంగానికి సూచించారు. గ్రామ సచివాలయం నుంచి పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు హామీ ఇచ్చినట్టుగానే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసి చూపించామని వారు తెలిపారు.

