Vallabhaneni Vamshi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వంశీ, ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు న్యాయపరమైన విచారణకింద ఉందని, ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
ఇక ఇటీవల దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో అరెస్టయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వంశీని జైలులో ములాఖత్‌లో మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కలిశారు.
ఇది కూడా చదవండి: Young Doctor Missing: విహారయాత్రలో విషాదం.. నదిలో హైదరాబాద్ మహిళా డాక్టర్ గల్లంతు.. (నదిలో గల్లంతైన వీడియో)
సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో వంశీ కుటుంబ పరిస్థితులు, కేసు ప్రగతి, తదితర అంశాలపై జగన్ చర్చించినట్లు సమాచారం. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ, సన్నిహితుడు సింహాద్రి రమేష్ కూడా జైలుకు వెళ్లారు.
ఈ పరిణామం రాజకీయంగా కీలకంగా మారింది. వైసీపీ వర్గాలు ఈ కేసును ప్రతిపక్ష కుట్రగా చూస్తున్నాయి, మరోవైపు టీడీపీ మాత్రం న్యాయపరమైన వ్యవహారంగా అభివర్ణిస్తోంది. వంశీకి హైకోర్టులో ఎదురైన ఇబ్బందుల కారణంగా కేసు మరింత జటిలమైనట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

