AP News: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను అమలు చేయడంలో వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం, మే నెలలో మరో రెండు ముఖ్యమైన పథకాలను అమలు చేయనుంది. వాటిలో ముఖ్యమైనది ‘అన్నదాత సుఖీభవ’ పథకం.
ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సహాయం అందించనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ పథకం కింద వచ్చే రూ.6 వేలు కూడా చేరుతుంది. మిగతా రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతులకు జమ చేయనున్నారు.
పథకం ప్రత్యేకత ఏమిటంటే, కేవలం భూమి కలిగిన రైతులకే కాకుండా, సొంత భూమి లేని కౌలు రైతులు కూడా ఈ ఆర్థిక సహాయం పొందవచ్చు. అంతేగాక, అటవీ భూములపై హక్కులు కలిగిన గిరిజనులకు కూడా ఈ పథకం వర్తించనుంది. అర్హుల జాబితా తయారీ కోసం వ్యవసాయశాఖ అధికారులు రైతుల వివరాలు పరిశీలిస్తున్నారు. ఈ జాబితాను మే 20 లోపు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
అయితే, ఈ పథకం అందరికి వర్తించదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత పెన్షన్ తీసుకునేవారు, రిజిస్టర్డ్ వృత్తి నిపుణులు (వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు మొదలైనవారు) ఈ పథకానికి అర్హులు కారు. కానీ, కింది స్థాయి ఉద్యోగులైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్-4 ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఉంది.
Also Read: Allu Aravind: శ్రీతేజ్ పరామర్శకు అల్లు అరవింద్
AP News: వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్రంలో సుమారు 43 లక్షల మంది రైతులు ఇప్పటికే పీఎం కిసాన్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. మరో 9-10 లక్షల మంది అర్హులు ఉండే అవకాశం ఉందని, వారందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని చెప్పారు. కౌలు రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలిపారు.
ఇకపై, ‘తల్లికి వందనం’ పథకం కింద పిల్లలకు పాఠశాల ప్రారంభానికి ముందే రూ.15 వేలు ఇవ్వనున్నారు. అలాగే, ‘దీపం-2’ కింద లక్షల కుటుంబాలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉద్యోగ నియామకాల్లో మెగా DSC ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ మొదలైంది.
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో నిధుల సమీకరణలో కూడా ప్రభుత్వం చురుకుగా ఉంది. జూన్ 12న కూటమి ప్రభుత్వానికి సంవత్సరం పూర్తి కానుండటంతో, సీఎం చంద్రబాబు నాయుడు నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఇప్పటి వరకు అమలైన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.