CM Chandrababu: విశాఖపట్నంలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆరంభమైంది. ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు, అంతర్జాతీయ డెలిగేట్లు, వ్యాపార వేత్తలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ వేడుకను ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలు పాల్గొన్నారు. సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో పాటు దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి చేరుకున్నారు.
సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ కార్యక్రమానికి 72 దేశాల నుండి ప్రతినిధులు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మొత్తం 2,500 మంది పాల్గొంటున్న ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కీలక వేదికగా నిలుస్తోందని తెలిపారు. విశాఖపట్నం దేశంలోనే అందమైన నగరమే కాకుండా, తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా అత్యంత సురక్షిత నగరమని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను దూరదృష్టి ఉన్న, సృజనాత్మకత కలిగిన నాయకుడిగా అభివర్ణించిన సీఎం, ఆంధ్రప్రదేశ్ దేశానికి గేట్‌వేలాగా మారుతున్నదని చెప్పారు. పెట్టుబడిదారులకు ఇష్టమైన రాష్ట్రంగా ఏపీ వేగంగా ఎదుగుతోందని తెలిపారు. దేశ ప్రజలు మోదీ పరిపాలనపై నమ్మకం ఉంచారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ మోదీ ప్రభుత్వం విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నాయకత్వం దేశానికి దక్కిందని, 2047 నాటికి భారత్ ప్రపంచంలో నంబర్ వన్ ఎకానమీగా మారుతుందని పేర్కొన్నారు.
Also Read: Ram Mohan Naidu: వచ్చే పదేళ్లలో ఏపీ దేశ గేట్‌వే అవుతుంది: కేంద్ర మంత్రి రామ్మోహన్
వనరులు, సాంకేతికత, మనుషులను సమర్థంగా ఉపయోగిస్తే భారత్‌ను ఎవరూ ఆపలేరని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని, పేదరికం, అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. గ్రీన్ ఎనర్జీ వినియోగం, స్వచ్ఛంద్ర ప్రాజెక్టులు, శుభ్రమైన అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పారు.
ఐటీ రంగంలో భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ముందున్నారని పేర్కొన్న ఆయన, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కూడా రానున్నాయని ప్రకటించారు. సోలార్, విండ్, పాంప్డ్ ఎనర్జీ రంగాల్లో ఏపీ దేశంలో ముందంజలో ఉందని తెలిపారు.
పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని, మరిన్ని పరిశ్రమలు స్థాపన దిశగా అడుగులు వేస్తున్నాయని సీఎం తెలిపారు. మరో రెండు సంవత్సరాల్లో డ్రోన్ ట్యాక్సీలు ప్రజా రవాణాలోకి ప్రవేశిస్తాయని ఆసక్తికరంగా వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకపాత్ర పోషిస్తుందని, అరకు కాఫీని అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రగతికి దారి చూపే వేదికగా కొనసాగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

