AP Mega DSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన విద్యాశాఖ, దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా (CBT) జరగనున్నాయి. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం సెషన్ 9:30 గంటల నుంచి 12:00 వరకు, మధ్యాహ్న సెషన్ 2:30 గంటల నుంచి 5:00 వరకు జరగనుంది.
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 16,347 పోస్టులకు గాను ఈ మెగా డీఎస్సీ ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్రానికి చెందిన అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేశారు. మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేశారు.
ఇది కూడా చదవండి: Fire Accident: ఎరువుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో, ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఇచ్చిన ఐచ్ఛికాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మందికి అనుకూలంగా పరీక్ష కేంద్రాలను కేటాయించారు.
ఈ మెగా డీఎస్సీ ద్వారా వేలాది మంది అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సమయానికి డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. పరీక్షల నిర్వహణ పట్ల ప్రభుత్వం అత్యంత కీలకంగా వ్యవహరిస్తోంది.