AP Budget 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. అంతకు ముందు ఆర్ధిక శాఖ అధికారులు బడ్జెట్ ప్రతులను ఆర్థికమంత్రికి అందచేశారు. ఆ తరువాత అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న పయ్యావుల కేశవ్ కు మంత్రివర్గ సహచరులు అభినందనలు తెలిపారు.
అసెంబ్లీ ప్రారంభం అయినవెంటనే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందిగా ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ కు సూచించారు. దీంతో బడ్జెట్ పై ప్రసంగం ప్రారంభించారు మంత్రి.
AP Budget 2024: మంత్రి పయ్యావుల కేశవ్ తన ప్రసంగంలో గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక వ్యవస్థ పతనమయ్యేలా చేశారని చెప్పారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని చెప్పిన పయ్యావుల గత ప్రభుత్వం లోపభూయిష్ట విధానాలను అమలు చేసిందని అన్నారు. అందుకే ఏపీ ప్రజలు అపురూపమైన తీర్పు ఇచ్చారని చెప్పారు మంత్రి. 2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి దశ నడిచిందని, వైసీపీ పాలన విధ్వంసంతోనే ప్రారంభమైందని విమర్శించారు. రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ విలువను దెబ్బతీశారని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారన్న మంత్రి.. ఆఖరుకు కేంద్ర పథకాలను, కార్పొరేషన్ల నిధులను కూడా దారిమళ్లించారంటూ వివరించారు.
ఏపీ రాష్ట్ర బడ్జెట్ హైలైట్స్ ఇవే..
రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్
రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు
రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు
ద్రవ్య లోటు రూ.68,743 కోట్లు
జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం
వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా :
బీసీ సంక్షేమం – రూ.39,007 కోట్లు
పాఠశాల విద్యాశాఖ – రూ.29,909 కోట్లు
ఉన్నత విద్య – రూ.2,326 కోట్లు
ఆరోగ్యరంగం – రూ.18,421 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి – రూ.16,739 కోట్లు
పట్టణాభివృద్ధి – రూ.11,490 కోట్లు
గృహ నిర్మాణం – రూ.4,012 కోట్లు
జలవనరులు – రూ.16,705 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం – రూ.3,127 కోట్లు
ఇంధనరంగం – రూ.8,207 కోట్లు
రోడ్లు, భవనాలు – రూ.9,554 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ – రూ.322 కోట్లు
పోలీసు శాఖ – రూ.8,495 కోట్లు
పర్యావరణం, అటవీశాఖ – రూ.687 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.7,557 కోట్లు
మైనార్టీ సంక్షేమం – రూ.4,376 కోట్లు
మహిళ, శిశుసంక్షేమం – రూ.4,285 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శాఖ – రూ.1,215 కోట్లు