Vangalapudi Anitha

Vangalapudi Anitha: గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీ.. ఏడాదిన్నరలోనే లక్ష్యం చేరుకున్నాం

Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ‘ఈగల్’ వ్యవస్థను స్థాపించిన తర్వాత కేవలం ఏడాదిన్నరలోనే ఏపీని ‘జీరో గంజాయి’ రాష్ట్రంగా మార్చామని ఆమె వెల్లడించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోంమంత్రి ఈ వివరాలను తెలిపారు. యువతను మాదక ద్రవ్యాల నుంచి రక్షించడానికి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే నినాదాన్ని స్కూల్ స్థాయి వరకు తీసుకెళ్తున్నామని ఆమె చెప్పారు.

యువత భవిష్యత్తు కోసమే ‘ఈగల్’ వ్యవస్థ
గతంలో గంజాయికి బానిసలుగా మారిన పిల్లల పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఎంతగానో తల్లడిల్లిపోయేవారని మంత్రి అనిత గుర్తు చేసుకున్నారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ‘ఈగల్’ వ్యవస్థను తీసుకొచ్చినట్లు ఆమె వివరించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, కేసుల్లో ఇరుక్కుంటే వచ్చే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం సీఎం చంద్రబాబు ఆరుగురు మంత్రులతో ఒక సబ్-కమిటీని కూడా ఏర్పాటు చేశారని ఆమె పేర్కొన్నారు.

Also Read: AP New Districts: ఏపీలో ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న కొత్త జిల్లాలు ఇవే..

జగన్‌పై తీవ్ర విమర్శలు: డ్రగ్స్ దందాకు ఒత్తాసు?
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డ్రగ్స్, గంజాయి విషయంలో యువత భవిష్యత్తు గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదని ఆమె స్పష్టం చేశారు. “మాదక ద్రవ్యాల కేసులో అడ్డంగా దొరికిన కొండారెడ్డి నేతృత్వంలో జగన్ శిక్షణ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా విద్యార్థులతో సమావేశాలు నిర్వహించడం ఏంటి?” అని హోంమంత్రి ప్రశ్నించారు.

‘గంజాయి ఆంధ్రప్రదేశ్’గా మార్చిన ఘనత వైకాపాదే
2019-24 మధ్యకాలంలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయనే పరిస్థితి వచ్చిందని అనిత విమర్శించారు. ఒకప్పుడు ‘అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్’గా పేరుగాంచిన రాష్ట్రాన్ని ‘గంజాయి ఆంధ్రప్రదేశ్’గా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఆమె ఎద్దేవా చేశారు. స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి కూడా గంజాయిని చేర్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని ఆరోపించారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై వైకాపా హయాంలో ఒక్క సమీక్ష కూడా చేయలేదని ఆమె విమర్శించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *