టాలీవుడ్ లెజెండరీ హీరో, దివంగత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆర్కే సినీ ప్లేక్స్‌లో అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు డైరెక్టర్ రాఘవేంద్ర రావు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కింగ్ నాగార్జున.. నాన్న మాకు నవ్వుతూ జీవించడం నేర్పించారని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోలో అభిమానులు రక్తదానం చేశారని.. నాన్నపై అభిమానులు చూపించిన ఆదరణ మా కుటుంబం ఎప్పుడూ మర్చిపోదన్నారు. గత రెండు సంవత్సరాలకు ఒకసారి ఏఎన్ఆర్ అవార్డులు ఇస్తున్నామని.. ఈ ఏడాది హీరో చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 28న ఏఎన్ఆర్ జాతీయ అవార్డుల వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోజున చిరంజీవిక అవార్డు ప్రధానం చేయనున్నట్లు చెప్పారు. అక్కినేని జాతీయ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబచ్చన్ రానున్నట్లు తెలుస్తుంది.
కాగా, అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి సందర్భంగా ఎక్స్ ద్వారా చిరంజీవి స్పందించారు. “అలనాటి గొప్ప నటులలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. నటనా మేధావి, సినీ రంగానికి చెందిన ప్రముఖుడు, ఏఎన్నార్ చిరస్మరణీయమైన ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో, మనస్సుల్లో చిరస్మరణీయంగా ఉంటాయి. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం, అదృష్టం తనకు దక్కాయి” చెప్పారు.