Bhupalpally Murder Suicide: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్న ఓ హృదయవిదారక ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. భార్యాభర్తలు ఇద్దరూ విగతజీవులుగా మారిన ఈ విషాదకర సంఘటనకు భార్య వేధింపులే కారణంగా తెలుస్తోంది.
దారుణ హత్య, ఆపై ఆత్మహత్య
ఈ దారుణం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం, సీతారాంపురం గ్రామంలో చోటుచేసుకుంది. బాలాజీ రామాచారి అనే వ్యక్తి తన రెండవ భార్య సంధ్యను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత తానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలాజీ రామాచారి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో భార్య సంధ్య తరచూ వేధింపులకు గురిచేస్తుండేవారట. భార్య వేధింపులను భరించలేకపోయిన బాలాజీ, అత్యంత దారుణ నిర్ణయం తీసుకున్నాడు. మొదట తన భార్య సంధ్యను తాడుతో ఉరిబిగించి హత్య చేశాడు.
ఇది కూడా చదవండి: Jemima Goldsmith: ఇచ్చిన మాట తప్పవు.. ఎలాన్ మస్క్‌కు ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య బహిరంగ లేఖ..!
వీడియోలో ‘మర్డర్ డిక్లరేషన్’
భార్యను హత్య చేసిన అనంతరం బాలాజీ రామాచారి ఒక వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియోనే ఈ జంట మరణాలకు కారణాలను వెల్లడించే ‘మర్డర్ డిక్లరేషన్’గా మారింది. భార్య వేధింపులు భరించలేకనే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆయన వీడియోలో స్పష్టం చేశాడు. ఈ వీడియోను తన స్టేటస్‌లో కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. భార్యను చంపిన తర్వాత, తాను కూడా అదే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉలిక్కిపడ్డ సీతారాంపురం
భార్యాభర్తలు ఇద్దరూ మరణించిన విషయం తెలియడంతో సీతారాంపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. భార్య వేధింపులే ఈ జంట మరణాలకు కారణమా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
