Ram Mohan Naidu: విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. వివిధ రంగాల ప్రతినిధులు, పరిశ్రమల అధినేతలు, అంతర్జాతీయ డెలిగేట్లు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సమావేశాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అధికారికంగా ఆరంభించారు. కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీతోపాటు దేశ–విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విశాఖపట్నం తూర్పు తీరంలో అత్యంత కీలక నగరంగా ఎదుగుతోందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం త్వరితగతిన అభివృద్ధి వైపు సాగుతుండగా, ఆ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు వెళ్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పురోగతికి స్పష్టమైన దిశ చూపించే నాయకత్వం ఉండటం వల్లే ఏపీ అభివృద్ధి పంథా వేగంగా మారిందని పేర్కొన్నారు.
Also Read: CII Partnership Summit: విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
రాష్ట్ర ప్రగతికి సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని మంత్రి వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం అత్యంత వేగంతో జరుగుతుండటం ఏపీ భవిష్యత్తును మార్చే ప్రాజెక్టులలో ఒకటని ఆయన అన్నారు. తక్కువ సమయంలో పెద్ద మార్పులు తెచ్చే అభివృద్ధి మోడల్‌నే తమ ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ త్వరలోనే లాజిస్టిక్స్, ఏవియేషన్ రంగాల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రంగా నిలవబోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే పదేళ్లలో దేశ అభివృద్ధికి ఏపీ ఒక ముఖ్య గేట్‌వేగా మారుతుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాకుండా, ఆ పెట్టుబడులు తీసుకువచ్చే ఫలితాల మీదే తమ దృష్టి కేంద్రీకృతమైందని ఆయన తెలిపారు.

