Swarnandhra: వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్ర @2047 కింద ఏటా 15 శాతానికి మించి వృద్ధి రేటు సాధించే విధంగా జిల్లా,మండల స్థాయి విజన్ ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల కార్యదర్శులు,జిల్లా కలక్టర్లకు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర @2047లో భాగంగా 2024-2029 ఐదేళ్ళ విజన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ప్రతి శాఖ ద్వారా ఏటా 15 శాతం కంటే అధిక వృద్ధి రేటు సాధనకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆదిశగా అన్ని శాఖలు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దీనిపై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు.స్వర్ణాంద్ర @2047 అప్డేట్ మరియు జిఎస్డిపి సెన్సిడైటేషన్ పై సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 686 మండలాలకు గాను విజయనగరం,మచిలీపట్నం,నంద్యాల,ఒంగోలు,చిత్తూరు 5 అర్బన్ మండలాలు మినహా మిగతా మండలాలన్నిటిలో మండల విజన్ ప్రణాళికలు పూర్తి చేశారని అన్నారు. ఈఐదు అర్బన్ మండలాలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీల ప్రణాళికల రూపకల్పనలో విజన్ ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుందని చెప్పారు.అదే విధంగా జిల్లాల ప్రణాళికల రూపకల్పనకు సంబంధించి ఈనెల 15వతేది ఆఖరు తేదీ కాగా రానున్న రెండు మూడు నాలుగు రోజుల్లో ఆప్రక్రియను పూర్తి చేయాలని సిఎస్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు.
Swarnandhra: ముఖ్యంగా నిర్దేశిత 15 శాతం వృద్ధి రేటు సాధనకు గాను ఆయా జిల్లాలు,ప్రాంతాలు, రంగాల వారీగా ప్రాముఖ్యత గల అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా లక్ష్య సాధనకు కృషి చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.ఉదాహరణకు రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవన రంగంలోను,కోస్తా తీర జిల్లాల్లో ఆక్వారంగం,తిరుపతి జిల్లాలో పర్యాటక రంగం పైన ప్రత్యేక దృషి సారించాల్సిన అవసరం ఉందని సిఎస్ పేర్కొన్నారు.అలాగే తీరప్రాంత జిల్లాల్లో ఓడరేవుల ఆధారిత అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఉదాహరణకు శ్రీకాకుళం,విశాఖపట్నం,కాకినాడ,మచిలీపట్నం,నెల్లూరు వంటి జిల్లాల్లో మెరుగైన వృద్ధి రేటు సాధనకు అవకాశాలున్నాయని తెలిపారు.కొన్ని శాఖల్లో 15 శాతం కంటే అధిక వృద్ది రేటు సాధించేందుకు మరికొన్ని శాఖల్లో అంతకంటే తక్కువ వృద్ధి రేటు సాధనకు అవకాశాలు ఉంటాయని అలాంటి చోట్ల మిగతా రంగాలపై అధిక దృష్టి సారించాలని సిఎస్ సూచించారు.అనంతరం స్వర్ణాంధ్ర @2047 మరియు జిఎస్డిపి సెన్సిటైజేషన్ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల భాగస్వామ్యం వారి నుండి వచ్చిన స్పందన,సూచనలు,సలహాలు తదితర అంశాలపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు.
Swarnandhra: ఈసమావేశంలో రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వర్ణాంధ్ర @2047 అప్ డేట్, జిఎస్డిపి సెన్సిటైజేషన్ కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మందికి పైగా భాగస్వాములై విజన్ ప్రణాళిక రూపకల్పనకు అవసరమైన సూచనలు,సలహాలను అందించారని వివరించారు.దీనిలో 56 శాతం మంది మహిళలు,28శాతం మంది విద్యార్ధులు,యువత,5శాతం సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నట్టు తెలిపారు.
ఇంకా ఈసమావేశంలో ప్రణాళికా శాఖ జాయింట్ సెక్రటరి ఆనంద్ శంకర్,ఆశాఖ డైరెక్టర్లు గోపాల్, సుదర్శన్, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
Also Read: AP Rains : భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు