Rain Alert: భారీ అలజడి రేపిన ‘మొంథా’ తుఫాన్ ఎట్టకేలకు తీరాన్ని దాటేసింది. మంగళవారం అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో కాకినాడకు దక్షిణాన, నరసాపురం దగ్గర తీరం దాటినా… దాని ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదు. మొంథా వెళ్ళిపోయినా, దాని ‘వాన గండం’ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంది.
తీరం దాటిన తుఫాన్ ప్రయాణం
ఆగ్నేయ బంగాళాఖాతంలో మొదలైన మొంథా తుఫాన్, పశ్చిమ దిశగా కదులుతూ అంతర్వేది పాలెం దగ్గర మొదట తీరాన్ని తాకింది. ఆ తర్వాత గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ నరసాపురం సమీపంలో తీరాన్ని దాటింది.
వచ్చే రెండు రోజులు ముప్పు: ఎందుకంటే?
తుఫాన్ తీరం దాటినా, ఆకాశంలో దట్టంగా పేరుకుపోయిన ‘క్లౌడ్ మాస్ ఎఫెక్ట్’ కారణంగా మరో రెండు రోజులు దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందుకే, తీరం వెంబడి ఇంకా బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి, కాబట్టి…
ముఖ్య సూచన: చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఎవరూ రెండు రోజుల పాటు సముద్రంలోకి వెళ్లకూడదు. పోర్టులలో ఇంకా ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్: జిల్లాలకు అలర్ట్
మొంథా తుఫాన్ కారణంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీనికి తోడు గాలుల తీవ్రత ఎక్కువ ఉండటంతో చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్ని గ్రామాలకు కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది.
* రెడ్ అలర్ట్: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
* ఆరెంజ్ అలర్ట్ : రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణ: పలు జిల్లాలకు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ తీరం దాటిన మొంథా ప్రభావం పక్కనే ఉన్న తెలంగాణపై కూడా చూపిస్తోంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
* రెడ్ అలర్ట్: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
* ఆరెంజ్ అలర్ట్: మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

