Anagani Satya Prasad: పేదవారికి సొంత ఇల్లు అందించాలనే లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈరోజు పేదల సొంతింటి కల సాకారమవుతున్న చారిత్రక రోజు అని ఆయన అన్నారు. తెలుగు ప్రజలందరికీ సొంత ఇల్లు ఉండాలనే దివంగత నేత ఎన్టీఆర్ ఆశయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందని చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల కేవలం 16 నెలల తక్కువ కాలంలోనే 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, లబ్ధిదారులకు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా, ఇంటి నిర్మాణంలో ఆలస్యం జరగకుండా త్వరగా పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. సొంతంగా స్థలం ఉండి కూడా ఇల్లు కట్టుకోలేని వారికి కూడా ఏపీ ప్రభుత్వం సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. 2029 సంవత్సరం నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. “పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం అని చెప్పి, సెంటు పట్టా పేరుతో జగన్ ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడింది” అని ఆరోపించారు. “పేదవాడి ఇంటి కోసం ఒక్క సెంటు స్థలమే ఇచ్చి, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మాత్రం అన్ని సౌకర్యాలు ఉన్న విలాసవంతమైన ప్యాలెస్లో సేదతీరారు” అని మంత్రి అనగాని దుయ్యబట్టారు.

