Amit sha: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి మావోయిస్టులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా జగదల్పూర్లో జరిగిన ‘దసరా దర్బార్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ నుంచి వరుస లేఖలు వెలువడుతున్నా, వారితో చర్చలకు అవకాశం లేదని స్పష్టం చేశారు.
అమిత్ షా మాట్లాడుతూ, 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మావోయిస్టులు బేషరతుగా ఆయుధాలు వదిలి లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. “మాట్లాడేందుకు ఏమీలేదు, కేవలం లొంగిపోవడమే మార్గం” అని స్పష్టం చేశారు. లొంగిపోయే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామని, పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అయితే, ఇప్పటికైనా మావోయిస్టులు ఆయుధాలు వదలకపోతే భద్రతా దళాలు వేటను మరింత ముమ్మరం చేస్తాయని అమిత్ షా హెచ్చరించారు. 2014–2024 మధ్య కాలంలో జరిగిన ఎన్కౌంటర్లలో భద్రతా బలగాల మరణాలు 70 శాతం, పౌరుల మరణాలు 85 శాతానికి తగ్గాయని వివరించారు. ఇప్పటి వరకు సుమారు 10,500 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు.
మావోయిస్టులపై పోరాటం తుదిదశలోకి చేరిందని స్పష్టం చేసిన అమిత్ షా, ఇకపై చర్చలు అసాధ్యం, లొంగడమే ఒక్కటే మార్గమని తేల్చి చెప్పరు.