Amit sha: రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు సమస్యను పూర్తిగా సమూలంగా నిర్మూలిస్తామని వెల్లడించారు. మావోయిస్టు సమస్యను పొలిటికల్ ఇష్యూ కాదని, ఇది దేశ భద్రతకు సంబంధించిన సమస్యగా అభివర్ణించారు.
మావోయిస్టుల నెట్వర్క్ను ధ్వంసం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించామని, పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు విస్తరించిన రెడ్ కారిడార్ ఇప్పుడు చాలా వరకు నిర్మూలించబడిందని తెలిపారు.
12 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టు ప్రభావం
ఆరంభంలో అనేక రాష్ట్రాల్లో వ్యాప్తి చెందిన మావోయిస్టుల ప్రభావం ప్రస్తుతం కేవలం 12 జిల్లాలకు పరిమితమైందని అమిత్ షా పేర్కొన్నారు. ఇది భద్రతా బలగాల సమర్థమైన చర్యల ఫలితమని స్పష్టం చేశారు.
సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాల పనితీరుకు ప్రశంసలు
మావోయిస్టు నిహతాలకు సంబంధించి సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్), కోబ్రా బలగాలు చూపించిన ధైర్యసాహసాలకు అమిత్ షా ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఈ బలగాల సమన్విత చర్యల వల్లే మావోయిస్టు సమస్య తగ్గుముఖం పట్టిందని అభిప్రాయపడ్డారు.
మావోయిస్టుల నిర్మూలన లక్ష్యం
మావోయిస్టు సమస్యకు చెక్ పెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని, 2026 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుదిట్టమైన వ్యూహాలను అమలు చేస్తున్నామని అమిత్షా తెలిపారు.