America: విమానాన్ని ఢీకొట్టింది అంతరిక్ష వ్యర్థాలా? – 36,000 అడుగుల ఎత్తులో భయానక ఘటన

America: అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ (United Airlines) బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం గాల్లో భయానక పరిస్థితిని ఎదుర్కొంది. డెన్వర్‌ నుంచి లాస్ ఏంజిల్స్‌కు వెళ్తున్న ఫ్లైట్‌ నంబర్‌ 1093, 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా, ఆకస్మాత్తుగా గుర్తు తెలియని వస్తువు ఢీకొట్టడంతో కాక్‌పిట్‌ ముందు ఉన్న అద్దం (విండ్‌షీల్డ్‌) పగిలిపోయింది.

ఈ ఘటనలో ఓ పైలట్‌ స్వల్పంగా గాయపడగా, విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే పైలట్లు చాకచక్యంగా స్పందించి విమానాన్ని 26,000 అడుగుల ఎత్తుకు దించి, సాల్ట్‌ లేక్‌ సిటీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు.

యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు స్పందిస్తూ – “ప్రయాణికులెవరూ గాయపడలేదు. వారందరినీ మరో విమానంలో సురక్షితంగా లాస్ ఏంజిల్స్‌కు తరలించాం. దెబ్బతిన్న విమానాన్ని మరమ్మతుల కోసం నిలిపివేశాం” అని తెలిపారు.

అంతరిక్ష వ్యర్థాలేనా కారణం?

విమాన నిపుణుల అనుమానం ప్రకారం, ఈ ప్రమాదం అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన వ్యర్థాల వల్ల జరిగి ఉండవచ్చు. 36,000 అడుగుల ఎత్తులో పక్షులు లేదా సాధారణ వాతావరణ వస్తువులు ఢీకొట్టడం సాధ్యం కాదని వారు చెబుతున్నారు. కాక్‌పిట్‌ అద్దంపై కాలిన గుర్తులు కనిపించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

అయితే, అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) మాత్రం అంతరిక్ష వ్యర్థాల వల్ల విమానాలకు ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువేనని తెలిపింది. ప్రస్తుతం భూమి చుట్టూ సుమారు 25,000 పెద్ద అంతరిక్ష వ్యర్థాలను నాసా ట్రాక్‌ చేస్తోంది

ఈ అరుదైన సంఘటన అంతర్జాతీయ విమానయాన భద్రతపై కొత్త ఆందోళనలను తెరపైకి తెచ్చింది. ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *