Amravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మలేషియా ప్రతినిధులతో రాష్ట్ర మున్సిపల్ & అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పి. నారాయణ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, మలేషియాకు చెందిన సెలాంగార్ స్టేట్ ఎక్స్కో మంత్రి పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గణబతిరావ్, అలాగే మలేషియా-ఆంధ్రా బిజినెస్ చాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ముందుగా అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించిన మలేషియా బృందం, అనంతరం రాష్ట్ర సచివాలయంలో ఈ చర్చలు జరిపింది.
సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ —
రెండున్నరేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం అని ప్రతినిధులకు వివరించారు.
ఇప్పటికే అమరావతి అభివృద్ధికి అనేక రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
అలాగే, మలేషియాకు చెందిన ప్రైవేట్ సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. రాబోయే ఐదేళ్లలో 6000 నుంచి 10,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే ప్రాజెక్టులను ప్రతిపాదించాయి.
ఈ సమావేశం ద్వారా అమరావతి రాజధాని ప్రాజెక్ట్‌కు మరింత అంతర్జాతీయ గుర్తింపు లభించనుందని అధికారులు అభిప్రాయపడ్డారు.