Air India: ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వివరాల్లోకి వెళితే, ఏఐ-451 (AI-451) నంబర్ గల విమానం శుక్రవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆక్జిలరీ పవర్ యూనిట్ (APU) అనూహ్యంగా షట్‌డౌన్ అయింది. పైలట్ దాన్ని మళ్లీ రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించినా విఫలమయ్యాడు.
భద్రతా కారణాల దృష్ట్యా పైలట్లు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఈ క్రమంలో ఏటీసీ (Air Traffic Control) అనుమతి తీసుకుని విమానాన్ని రన్‌వేపై సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. సంఘటన అనంతరం విమానాన్ని టెక్నికల్ టీమ్ పూర్తిగా తనిఖీ చేస్తోంది. లోపం కారణం ఏమిటో తెలుసుకునేందుకు ఎయిర్ ఇండియా సాంకేతిక నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు.
ఎయిర్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ,“మా ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. ఈ ఘటనలో ఎవరికీ హానీ జరగలేదు. విశాఖపట్నం వెళ్ళాల్సిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేశాం” అని తెలిపారు.ఈ ఘటనతో ప్రయాణికులు కొద్దిసేపు ఆందోళనకు గురైనా, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

