Adi srinivas: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు పూర్తిగా శాస్త్రపరమైన పద్ధతిలోనే కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. భీమేశ్వర ఆలయంలో ప్రస్తుతం ఆర్జిత సేవలను కొనసాగిస్తూ, భక్తుల దర్శనాలు కూడా సక్రమంగా జరుగుతున్నాయని చెప్పారు.
కేంద్రమంత్రి బండి సంజయ్, స్థానిక ప్రజలు, అలాగే ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు సూచించిన విషయాలను పరిశీలించి, వాటిని అమలు చేస్తున్నామని తెలిపారు. “ఈరోజు వచ్చిన కొత్త సూచనలను కూడా స్వీకరిస్తాం. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోంది” అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
“రాజన్న ఆలయం మూసివేశారనేది పూర్తిగా అవాస్తవం. నిత్యపూజలు ఎటువంటి అంతరాయం లేకుండా ఏకాంతంగా జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు కొనసాగుతున్న సమయంలో భక్తుల రక్షణ దృష్ట్యా భీమేశ్వర ఆలయంలో తాత్కాలిక దర్శనాల ఏర్పాట్లు చేశాం” అని ఆయన వివరించారు.
వేములవాడలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయ్యాక ఆలయ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.