Aadi Srinivas: కేంద్రంలో బీజేపీ రోజురోజుకు దిగజారిపోతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నేత రాంచందర్‌రావు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పలు అంశాలపై బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నకిలీ ఓట్లు, బీసీ రిజర్వేషన్లపై…
నకిలీ ఓట్ల అంశంపై బీజేపీ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ సరైన సమాధానం చెబుతుందని ఆయన అన్నారు.
బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ, బీహార్‌లో 60 శాతం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం లభించిందని, మరి తెలంగాణకు ఒక న్యాయం, బీహార్‌కు ఒక న్యాయమా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు.
బీజేపీపై ప్రశ్నల వర్షం
“దేశం కోసం బీజేపీ ఏమైనా త్యాగం చేసిందా?” అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏంటని నిలదీశారు. బీజేపీ కేవలం మత రాజకీయాలు చేస్తోందని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.