Minister Lokesh: ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్నారికి చదువుకునే అవకాశం కల్పించేందుకు మంత్రి నారా లోకేశ్ ముందుకు వచ్చారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం, బూదూరు గ్రామానికి చెందిన జెస్సీ అనే విద్యార్థిని, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) లో సీటు రాకపోవడంతో కూలి పనులకు వెళ్తున్న వార్తపై ఆయన వెంటనే స్పందించారు.
లోకేశ్ హామీ, అధికారులకు ఆదేశం
జెస్సీ కష్టాన్ని చూసి చలించిపోయిన మంత్రి నారా లోకేశ్, ఆమెకు అండగా నిలిచారు. పత్రికల్లో వచ్చిన జెస్సీ కథనం తనను ఎంతగానో కదిలించిందని ఆయన తెలిపారు. వెంటనే అధికారులతో మాట్లాడి జెస్సీకి కేజీబీవీలో సీటు ఇప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. “చిట్టితల్లీ! నిశ్చింతగా చదువుకో.. కేజీబీవీలో సీటు ఇప్పించే బాధ్యత నాది” అని లోకేశ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా హామీ ఇచ్చారు.
Also Read: jubliee hills: బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
ఈ సందర్భంగా, పిల్లలను బడికి పంపే ప్రాముఖ్యతను లోకేశ్ తల్లిదండ్రులకు వివరించారు. పుస్తకాలు, పెన్ను పట్టుకోవాల్సిన చేతులు పత్తి చేలలో కూలీగా మగ్గిపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని మంచి భవిష్యత్తు వైపు నడిపించే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం వంటి పథకాలను ఆయన గుర్తు చేశారు. పిల్లల భద్రతకు, భవిష్యత్తుకు బడి కన్నా సురక్షితమైన ప్రదేశం లేదని ఆయన చెప్పారు. విద్యకు పిల్లలను దూరం చేయవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.