Palnadu: ఆరోగ్యశాఖలో పనిచేసే సామాజిక ఆరోగ్య అధికారిని సూపర్ వైజరు హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా మండపల్లి మండలం లోకమూడి గ్రామానికి చెందిన వాసిపల్లి సీతారత్నం.. మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరుగా పనిచేస్తున్నారు. ఆరు నెలల కిందట కృష్ణా జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆమె.. ఒంటరిగా బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటుంది.
అదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామానికి చెందిన మన్నెం శ్రీనివాసరావు సూపర్ వైజరుగా పనిచేస్తున్నారు. వారిద్దరూ కలిసి విధుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై గ్రామాలకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు ఆమె ఉండే ఇంటికి వెళ్లారు.. ఇద్దరు ఏదో విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో ఆమెను బలంగా తోసేయడంతో తల గోడకు తగిలి తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు..
గొడవ జరిగే సమయంలో ఆమె పెద్దగా కేకలు వేయడంతో పరిసర ప్రాంతవాసులు వచ్చి చూసేలోపే ఆమె మృతి చెంది ఉంది.. శ్రీనివాసరావు అక్కడే ఉన్నారు.. స్థానికులు ఇంటి తలుపులు వేసి పోలీసులకు సమాచారం అందించారు.సీఐ వెంకట్రావు, ఎస్‌ఐ మోహన్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

