RBI Repo Rate Cut: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం మానిటరీ పాలసీ కమిటీ (MPC) నిర్ణయాలను ప్రకటిస్తూ, రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) మేర తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీంతో రెపో రేటు 5.50 శాతం నుంచి 5.25 శాతానికి దిగొచ్చింది.
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం (Inflation) కనిష్ట స్థాయికి పడిపోవడం, స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు పెరగడం వంటి సానుకూల అంశాల కారణంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు తగ్గింపుతో గృహ రుణాలు, వాహన రుణాలు వంటి వాటిపై వడ్డీ భారం మరింత తగ్గనుంది.
ఈ ఏడాదిలో వడ్డీ రేట్ల ట్రిపుల్ బొనాంజా
ఆర్బీఐ 2025లో వడ్డీ రేట్లను తగ్గించడం ఇది నాలుగోసారి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు రెపో రేటు మొత్తం 1.25 శాతం (125 బేసిస్ పాయింట్లు) మేర తగ్గింది.
ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున కోత.
జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత.
తాజాగా శుక్రవారం మరో 25 బేసిస్ పాయింట్లు కోత.
ఇతర కీలక వడ్డీ రేట్లను కూడా ఆర్బీఐ సర్దుబాటు చేసింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును 5 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటును 5.5 శాతంగా కొనసాగించింది. ఈ రేట్ల తగ్గింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Also Read: Loan Apps: అనధికార యాప్‌లపై కేంద్రం మరో సంచలన నిర్ణయం
వృద్ధి రేటు అంచనాల పెంపు
దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. తాజా సమీక్షలో ఆయన చెప్పిన కీలక అంశాలు ఇవి:
జీడీపీ వృద్ధి: జీఎస్టీ హేతుబద్ధీకరణతో కొనుగోళ్లు పెరగడం వలన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి నమోదైంది. ఈ నేపథ్యంలో, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచుతున్నట్లు మల్హోత్రా తెలిపారు.
ద్రవ్యోల్బణం అంచనా తగ్గింపు: ద్రవ్యోల్బణం (వస్తువుల ధరల పెరుగుదల) అంచనాలు బాగా మెరుగుపడ్డాయి. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను 2.6 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ద్రవ్యోల్బణం 4 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటుందని అంచనా వేశారు.
విదేశీ మారక నిల్వలు: ప్రస్తుతం దేశంలో 686 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, ఇవి రాబోయే 11 నెలల దిగుమతులకు సరిపోతాయని తెలిపారు.
ప్రభుత్వ సెక్యూరిటీలు: రూ. 1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్ విక్రయాల కోసం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ నిర్వహించాలని కూడా ఆర్బీఐ నిర్ణయించింది.
ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా ఉంచుతూనే, ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే విధంగా రుణ పరిస్థితులు ఉండేలా చూసుకోవడం తమ ప్రధాన లక్ష్యమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరించారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి దోహదపడనుంది.

